Telugu Global
Andhra Pradesh

అది ఇంత తేలికైన అంశమేనా?.. పురందేశ్వరి వ్యాఖ్యల వెనుక..

ఐటీ నోటీసుల జారీ అన్నది ఒక సాధారణ పక్రియ అంటూ తేలికగా తీసేశారు. అటువంటి వాటిపై తాను స్పందించబోనన్నారు.

అది ఇంత తేలికైన అంశమేనా?.. పురందేశ్వరి వ్యాఖ్యల వెనుక..
X

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి ఐటీ నోటీసులు జారీ చేయడంపై ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. నోటీసులపై పవన్‌ కల్యాణ్, పురందేశ్వరి, సీపీఐ రామకృష్ణ, నారాయణ ఎవరూ స్పందించడం లేదు.. వీరంతా చంద్రబాబు కేంద్రంగా రింగ్‌ అయ్యారు అందుకే రియాక్ట్ అవడం లేదని వైసీపీ ఆరోపిస్తూ వస్తోంది. పురందేశ్వరి వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీ వాదనకు మరింత ఊతం ఇచ్చేలా ఉన్నాయి.

ఐటీ నోటీసులపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా స్పందించేందుకు ఆమె ఆసక్తి చూపలేదు. ఐటీ నోటీసుల జారీ అన్నది ఒక సాధారణ పక్రియ అంటూ తేలికగా తీసేశారు. అటువంటి వాటిపై తాను స్పందించబోనన్నారు. అయితే బీజేపీ ఏపీ నేత విల్సన్ మాత్రం ఆధారాలు ఉంటే చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తన నిజాయితీని నిరూపించుకోవాలి గానీ... నోటీసులు ఇచ్చే పరిధి లేదు... నోటీసులు చెల్లవు అంటూ మాట్లాడడం సరికాదన్నారు.

అయితే పురందేశ్వరి ఐటీ నోటీసులను సాధారణ పక్రియగా చెప్పారే గానీ.. ఇక్కడ నోటీసులు వచ్చింది ఏదో కంపెనీకి కాదు. ఆదాయం రికార్డుల్లో చూపలేదు అనే అభియోగం కంటే... 118 కోట్ల రూపాయలు ముడుపుల రూపంలో వచ్చాయన్నదే ప్రధాన అంశం. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి .. ఈ ముడుపులు ఎందుకు తీసుకున్నారు అని ప్రశ్నించాల్సింది. కానీ ఆమె చంద్రబాబుకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించేందుకు సుముఖంగా లేరు కాబోలు. అందుకే ఐటీ నోటీసులపై స్పందించను అంటూ దాటేశారు.


First Published:  6 Sep 2023 5:44 AM GMT
Next Story