Telugu Global
Andhra Pradesh

ఏపీలో బీజేపీ సొంత కుంపటి.. నియోజకవర్గాలకు కన్వీనర్ల నియామకం..

రాష్ట్రంలో యుద్ద ప్రాతిపదికన అసెంబ్లీ నియోజకవర్గాలకు కన్వీనర్లు.. కో-కన్వీనర్లను నియమించింది బీజేపీ. పొత్తులు లేకపోయినా తాము ఒంటరి పోరాటానికి సిద్ధమేననే సంకేతాలిచ్చారు.

ఏపీలో బీజేపీ సొంత కుంపటి.. నియోజకవర్గాలకు కన్వీనర్ల నియామకం..
X

ఏపీలో బీజేపీ, జనసేన పొత్తు ఎండమావేనని అందరికీ తెలుసు. కానీ అధికారికంగా అటునుంచి కానీ, ఇటునుంచి కానీ ప్రకటన మాత్రం రాలేదు. అలాగని కలసే ఉన్నాం, కలసే పోటీ చేస్తామనే మాట కూడా లేదు. ఎవరు ముందు తూచ్ అంటే.. రెండోవాళ్లు ఆరోపణలు చేయడానికి రెడీగా ఉన్నారు. అందుకే ఇరు వర్గాలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉన్నాయి. కానీ ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత వ్యవహారం మరింత చెడినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన తమకు మద్దతివ్వలేదని బీజేపీ అభ్యర్థి మాధవ్ విమర్శించారు. తమ మధ్య పొత్తు ఉన్నా లేనట్టేనన్నారు. సోము వీర్రాజు కూడా దాదాపుగా ఇలాగే మాట్లాడారు. అయితే వీటన్నిటికి మించి ఈరోజు ఏపీలోని నియోజకవర్గాలకు బీజేపీ కన్వీనర్లను నియమించడం మాత్రం పొత్తు వ్యవహారానికి ఎండ్ కార్డ్ వేసినట్టయింది.

రాష్ట్రంలో యుద్ద ప్రాతిపదికన అసెంబ్లీ నియోజకవర్గాలకు కన్వీనర్లు.. కో-కన్వీనర్లను నియమించింది బీజేపీ. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 163 మందిని వివిధ నియోజకవర్గాల్లో కన్వీనర్లు, కో-కన్వీనర్లుగా ప్రకటించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. పొత్తులు లేకపోయినా తాము ఒంటరి పోరాటానికి సిద్ధమేననే సంకేతాలిచ్చారు.

అయితే పొత్తులకు, ఈ నియామకాలకు సంబంధం లేదంటున్నారు ఏపీ బీజేపీ నేతలు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం జరిపిన నియామకాలు మాత్రమే అంటున్నారు. అన్ని పార్టీలు ఇన్ ఛార్జిలను నియమిస్తున్నట్టే, తాము కూడా కన్వీనర్లను నియమించామని చెప్పారు. పార్టీని పటిష్టం చేయడంపైనే తాము దృష్టి పెట్టామని పొత్తుల విషయం అధిష్టానం చూసుకుంటుందని అంటున్నారు.

కన్వీనర్లే అభ్యర్థులా..?

అటు ఏపీ సీఎం జగన్ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. కొంతమంది సిట్టింగ్ లకు టిక్కెట్లు లేవని చెప్పి వారి స్థానాల్లో ఇన్ చార్జ్ లను కూడా పెట్టేశారు. ఇటు టీడీపీ కూడా కొద్దో గొప్పో స్పీడ్ గానే ఉంది. జనసేన, బీజేపీ మాత్రం పొత్తుల విషయంలో వేచి చూస్తున్నాయి. జనసేన ఏ గట్టున ఉండాలా అని ఆలోచిస్తోంది. అప్పుడే అభ్యర్థులను ప్రకటించాలనుకుంటోంది. బీజేపీ కూడా అభ్యర్థులను ప్రకటించే క్రమంలోనే కన్వీనర్లు, కో కన్వీనర్లను నియమించినట్టు తెలుస్తోంది. దాదాపుగా వీరినే అభ్యర్థులుగా ప్రకటించే అవకాశముంది. బీజేపీ కన్వీనర్లను నియమించినంత మాత్రాన ఏపీలో ఏదో జరిగిపోతుందనుకోలేం కానీ, జనసేన పొత్తు విషయంలో మాత్రం ఇప్పటికైనా ఆ పార్టీ ఓ క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది.

First Published:  28 March 2023 11:17 AM GMT
Next Story