Telugu Global
Andhra Pradesh

వీడియో ఫుటేజ్ విడుదల చేయాలి.. టీడీపీ డిమాండ్

స్పీకర్ పోడియం వద్దకు తాము నిరసన తెలపడానికి వెళ్తే మార్షల్స్ రావొచ్చని, కానీ అధికార పార్టీ సభ్యులకు సంబంధం ఏంటని నిలదీశారు. వీడియో ఫుటేజీ విడుదలకు డిమాండ్ చేశారు.

వీడియో ఫుటేజ్ విడుదల చేయాలి.. టీడీపీ డిమాండ్
X

ఏపీ అసెంబ్లీలో దాడి ఘటన సంచలనంగా మారినా, ఆ తర్వాత ఆరోపణలు, ప్రత్యారోపణలు మాత్రం పలు అనుమానాలకు తావిస్తున్నాయి. దాడి మీరు చేశారంటే, కాదు మీరు చేశారంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. పోలీస్ కేసులు పెట్టుకున్నారు. అయితే ఇక్కడ అసెంబ్లీ వీడియో ఫుటేజీ కీలకంగా మారింది. అసెంబ్లీలో అప్పుడు ఏం జరిగిందో ప్రజలకు చెప్పాలని వీడియో ఫుటేజీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేల ప్రాణాలకు రక్షణ లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. అసెంబ్లీ హైసెక్యూరిటీ జోన్ అయినా.. ప్రతిపక్షానికి ప్రతికూలమైన జోన్ అని అన్నారు, టీడీపీ సభ్యుల ప్రాణాలకు అపాయం కలిగించే రీతిలో దాడి జరిగింది కాబట్టే.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు. సభలో భౌతిక దాడులు జరిగితే పోలీస్ విచారణ జరపొచ్చనే రూలింగ్ ఉందన్నారు. పవిత్రమైన అసెంబ్లీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు.

అదో కోడికత్తి..?

అసెంబ్లీ దాడి తర్వాత ఎమ్మెల్యే సుధాకర్ బాబు చేతికి కట్టుకట్టుకుని ఉండటాన్ని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. సుధాకర్ బాబు మళ్లీ కోడి కత్తి తరహా డ్రామా ఆడుతున్నారని, అందుకే చేతికి కట్టు కట్టుకున్నారని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్యేలు. సోమవారం ఉదయం సంఘటన జరిగితే ఇప్పటి వరకు వీడియో ఫుటేజ్ ఎందుకు విడుదల చేయలేదన్నారు. ఎడిటింగ్ చేయకుండా వీడియో ఫుటేజ్ విడుదల చేస్తే వాస్తవాలు బయట పడతాయని చెప్పారు.





తనకు తానే గాయం..

సుధాకర్ బాబు తనంతట తానే బ్లేడుతో చిన్న గాయం చేసుకున్నారని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి. కావాలనే బ్లేడుతో గాటు పెట్టుకున్నారని వైసీపీ సభ్యులే చెబుతున్నారని, పథకం ప్రకారం తనపై దాడి చేశారని, దానికి స్పీకరే ప్రత్యక్ష సాక్షి అన్నారు. స్పీకర్ పోడియం వద్దకు తాము నిరసన తెలపడానికి వెళ్తే మార్షల్స్ రావొచ్చని, కానీ అధికార పార్టీ సభ్యులకు సంబంధం ఏంటని నిలదీశారు. వీడియో ఫుటేజీ విడుదలకు డిమాండ్ చేశారు.

First Published:  21 March 2023 1:43 AM GMT
Next Story