Telugu Global
Andhra Pradesh

నేటినుంచి ఏపీ అసెంబ్లీ.. నిరసనలతో టీడీపీ రెడీ

ఈనెల 17న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 2.6 లక్షల కోట్లతో ఈసారి బడ్జెట్ ప్రతిపాదనలు ఉండబోతున్నాయి.

AP Budget 2023: నేటినుంచి ఏపీ అసెంబ్లీ.. నిరసనలతో టీడీపీ రెడీ
X

AP Budget 2023: నేటినుంచి ఏపీ అసెంబ్లీ.. నిరసనలతో టీడీపీ రెడీ

ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఈరోజునుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఏపీ నూతన గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ తొలిసారిగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం తొలిరోజు సమావేశాలు వాయిదా పడతాయి. ఆ తర్వాత శాసనసభ, శాసనమండలి వ్యవహారాల సలహా మండళ్లు భేటీ అవుతాయి, సమావేశాల అజెండా ఖరారు చేస్తాయి.

ఈనెల 17న బడ్జెట్..

ఈనెల 17న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 2.6 లక్షల కోట్లతో ఈసారి బడ్జెట్ ప్రతిపాదనలు ఉండబోతున్నాయి. ప్రభుత్వం తరఫున 25 నుంచి 30 అంశాలపై చర్చకు అధికార పక్షం ప్రతిపాదించే అవకాశాలున్నాయి.


ప్రతిపక్ష టీడీపీ 15 సమస్యలపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమవుతోంది. విద్యుత్ చార్జీల పెంపు, పోలవరం ఆలస్యం, నిరుద్యోగ సమస్యలు, సభలు-సమావేశాలపై ఆంక్షలు వంటి అంశాలపై ప్రధానంగా టీడీపీ దృష్టిసారించే అవకాశముంది. ఎప్పటిలాగే టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. వెంకటపాలెంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించి ప్రదర్శనగా అసెంబ్లీకి బయలుదేరుతారు. నిరసనలకు రెడీ అవుతున్నారు.

విశాఖపై మరింత స్పష్టత..

ఇప్పటికే విశాఖ పాలనా రాజధాని అంటూ ప్రభుత్వం విస్తృత ప్రచారం చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విశాఖలో ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై కూడా అసెంబ్లీలో సీఎం జగన్ మరింత స్పష్టత ఇచ్చే అవకాశముంది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు చట్టబద్ధత కల్పిస్తూ ఈ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు తీసుకు రాబోతున్నారు. గతంలో జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో ఇప్పుడు బిల్లు తీసుకొచ్చి చట్టబద్ధత కల్పించబోతున్నారు.

First Published:  14 March 2023 2:14 AM GMT
Next Story