Telugu Global
Andhra Pradesh

ఏపీ అకడమిక్ క్యాలెండర్.. మార్పులు చేర్పులు ఏంటంటే..?

ఈ ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం తరపున టెన్త్, ఇంటర్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేస్తామన్నారు మంత్రి బొత్స. టెన్త్‌, ఇంటర్‌ లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు జగనన్న ఆణిముత్యాల పేరుతో​ ప్రోత్సహకాలు ఉంటాయని తెలిపారు.

ఏపీ అకడమిక్ క్యాలెండర్.. మార్పులు చేర్పులు ఏంటంటే..?
X

ఏపీలో 2023-24 అకడమిక్‌ క్యాలెండర్‌ ను విడుదల చేశారు సీఎం జగన్. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తీసుకు రావాల్సిన మార్పులపై చర్చించారు. స్కూల్‌ కాంప్లెక్స్‌ షెడ్యూల్, లాంగ్వేజ్‌ మేళా, లాంగ్వేజ్‌ క్లబ్, లాంగ్వేజ్‌ ల్యాబ్స్‌, లెర్న్‌ ఏ వర్డ్‌ ఏ డే, తెలుగు భాషా వారోత్సవాలతో కొత్త అకడమిక్ క్యాలెండర్ రూపొందించారు. వీటి ద్వారా విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడాలని సూచించారు సీఎం జగన్.


ఏపీలో జూన్‌ 12న తిరిగి పాఠశాలలు ప్రారంభం అవుతాయి. అదే రోజునుంచి రాష్ట్రవ్యాప్తంగా జగనన్న విద్యాకానుక పంపిణీ మొదలవుతుంది. పల్నాడు జిల్లా క్రోసూరులో జగనన్న విద్యాకానుక పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారని తెలిపారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాష్ట్రవ్యాప్తంగా 40లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుక అందిస్తామన్నారు. జూన్‌ 28వ తేదీన సీఎం జగన్‌ చేతుల మీదుగా అమ్మఒడి కార్యక్రమం మొదలుపెడతామన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు టోఫెల్‌ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి మండలానికి రెండు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు మంత్రి బొత్స. ఇందులో ఒక జూనియర్‌ కాలేజీ కేవలం విద్యార్థినులకోసం కేటాయిస్తున్నట్టు స్పష్టం చేశారు.

జగనన్న ఆణిముత్యాలు..

ఈ ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం తరపున టెన్త్, ఇంటర్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేస్తామన్నారు మంత్రి బొత్స. టెన్త్‌, ఇంటర్‌ లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు జగనన్న ఆణిముత్యాల పేరుతో​ ప్రోత్సహకాలు ఉంటాయని తెలిపారు. విద్యార్ధులకు ఇవ్వబోయే మెడల్స్‌, సర్టిఫికెట్లను సీఎం జగన్ పరిశీలించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నియోజకవర్గ స్ధాయిలో ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్ధులను జూన్‌ 15న, జిల్లా స్ధాయిలో జూన్‌ 17, రాష్ట్ర స్ధాయిలో జూన్‌ 20న అవార్డులు ప్రదానం చేస్తామన్నారు. స్టేట్‌ ఎక్స్‌ లెన్స్‌ అవార్డ్స్‌ 2023 పేరిట ఈ పురస్కార ప్రదానోత్సవాలు నిర్వహిస్తారు.

First Published:  8 Jun 2023 2:40 PM GMT
Next Story