Telugu Global
Andhra Pradesh

నాన్నా..! నన్ను వెతకొద్దు ప్లీజ్..

విశాఖపట్నం, ఆర్కే బీచ్, సాయి ప్రియ.. ఈరోజు మొత్తం మీడియాలో మారుమోగిన పేర్లివి

RK beach woman missing sai Priya Bengaluru married lover
X

విశాఖపట్నం, ఆర్కే బీచ్, సాయి ప్రియ.. ఈరోజు మొత్తం మీడియాలో మారుమోగిన పేర్లివి. విశాఖ ఆర్కే బీచ్ లో అదృశ్యమైందని అనుకున్న సాయిప్రియ కోసం నేవీ హెలికాప్టర్లు వెదకడం, గజ ఈతగాళ్లతో సముద్రాన్ని జల్లెడ పట్టాలనుకోవడం, అసలు బీచ్ లో లైఫ్ జాకెట్లు లేవంటూ ప్రభుత్వంపై కొందరు విమర్శలు ఎక్కు పెట్టడం.. అబ్బో పెద్ద రాద్ధాంతం జరిగింది. చివరికి తేలిందేంటంటే.. సాయి ప్రియ తనకు తానుగా రవి అనే మరో వ్యక్తితో జాగ్రత్తగా అక్కడినుంచి జారుకుంది. ఈ విషయం తెలియక సాయిప్రియ భర్త హడావిడి పడ్డాడు, అధికార యంత్రాంగాన్ని హడావిడి పెట్టించాడు. దాని జమా ఖర్చులెంతో కూడా ఆ తర్వాత మీడియా హైలెట్ చేసింది కానీ, నిజంగానే సాయిప్రియ అనే మహిళ ప్రమాదవశాత్తు సముద్ర అలలకు చిక్కుకుని ఉంటే ఈ లెక్కలు బయటకొచ్చేవి కావు.

సాయి ప్రియ కేరాఫ్ బెంగళూరు..

మధ్యాహ్నం వరకు ఈ వార్త హైలెట్ అయింది. సాయిప్రియ విశాఖ నుంచి రవితో కలసి నేరుగా నెల్లూరుకు వచ్చిందని, ఆమె నెల్లూరులోనే ఉందని పుకార్లు షికార్లు చేశాయి. అయితే నెల్లూరు పోలీసులకి మాత్రం ఈ సాయిప్రియ వ్యవహారం మింగుడు పడలేదు. నెల్లూరు వచ్చిన మహిళ కోసం విశాఖ అధికారులు హడావిడి పడిపోయారు, కానీ నెల్లూరులో ఆమె జాడ దొరకలేదు. దీంతో ఈ వ్యవహారం పెద్ద పజిల్ లా మారింది. చివరకు తేలిందేంటంటే.. సాయిప్రియ కేరాఫ్ బెంగళూరు అని.

అవును, సాయిప్రియ ఇప్పుడు బెంగళూరులో ఉన్నట్టు ఆమె సెల్ ఫోన్ సిగ్నల్స్ ని బట్టి గుర్తించారు. అయితే ఆమె తన తండ్రి విషయంలో ఆందోళన చెందుతోంది. తాను రవిని పెళ్లి చేసుకున్నానంటూ ఫొటోలు కూడా తండ్రికి పంపించింది. నాన్నా, నన్ను వెతకొద్దు ప్లీజ్ అంటూ ఆడియో మెసేజ్ లు కూడా పంపించింది. తనకు బతకాలని ఉందని, తన విషయంలో రవి తప్పేమీ లేదని, రవి పేరెంట్స్ కి కూడా ఏమీ తెలియదని చెప్పుకొచ్చింది. తను, రవి గతంలోనే ప్రేమించుకున్నామని, ఇప్పుడు పెళ్లి చేసుకున్నామని చెప్పింది. మమ్మల్నిలా బతకనివ్వండి అంటూ బతిమాలుకుంటోంది.

బకరాలు అయిందెవరు..?

విషయం తెలియక సాయిప్రియ ఆచూకీకోసం హడావిడి పడిన అధికార యంత్రాంగాన్ని తప్పుపట్టలేం. సంవత్సరం పాటు కాపురం చేసినా భార్య మనసు తెలుసుకోలేకపోయిన భర్తని కూడా తప్పుపట్టలేం. భార్య కనపడకపోయే సరికి తాను కంగారు పడి, అధికారుల్ని హడావిడి పెట్టిన భర్త మానసిక పరిస్థితి ఇప్పుడెలా ఉంటుందో ఊహించలేం. మొత్తమ్మీద సాయిప్రియ తాను అనుకున్నది సాధించింది. మీడియాకి మంచి విందుభోజనం పెట్టింది.

First Published:  27 July 2022 5:10 PM GMT
Next Story