Telugu Global
Andhra Pradesh

వివేకా హత్య కేసులో ట్విస్ట్.. తెరపైకి మైనార్టీ నేతలు

ముస్లిం మహిళ వ్యక్తిగత జీవితాన్ని బజారున పడేసేలా ఎంపీ అవినాష్‌ రెడ్డి వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని అన్నారు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారుఖ్‌ షిబ్లీ.

వివేకా హత్య కేసులో ట్విస్ట్.. తెరపైకి మైనార్టీ నేతలు
X

వైఎస్ వివేకా హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. స్థానికంగా వైఎస్ వివేకా గురించి ఎలాంటి కథనాలు ప్రచారంలో ఉన్నాయో తెలియదు కానీ.. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లు, మీడియా ముందు చెప్పిన మాటలతో వైఎస్ వివేకాకు ఇతర సంబంధాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం రాష్ట్రవ్యాప్తంగా మొదలైంది. వివేకా రెండో వివాహం చేసుకున్నారని, పేరుని షేక్ మహ్మద్ అక్బర్ గా మార్చుకున్నారని, ఆయనకో కొడుకు ఉన్నారని, ఆ కుటుంబానికి ఆస్తి పంచి ఇచ్చే క్రమంలోనే వివేకా హత్య జరిగి ఉండొచ్చని అవినాష్ రెడ్డి బలంగా ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై మైనార్టీ నేతలు స్పందించడం ఇక్కడ ట్విస్ట్.

ముస్లిం మహిళ వ్యక్తిగత జీవితాన్ని బజారున పడేసేలా ఎంపీ అవినాష్‌ రెడ్డి వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని అన్నారు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారుఖ్‌ షిబ్లీ. ముస్లిం సమాజాన్ని కించపరిచేలా మాట్లాడటం తమకు ఆవేదన కలిగించిందన్నారు. ఈ రాష్ట్రంలో విశ్వసనీయత, పరువు, మర్యాదలు కేవలం వైఎస్‌ కుటుంబానికి మాత్రమే ఉన్నాయా అని ప్రశ్నించారాయన. అసలు వివేకా హత్య గురించి మాట్లాడకుండా.. ఆయన పేరు మార్చుకున్నారని, వారికో కుమారుడు ఉన్నాడని.. వారిని విచారించాలని అవినాష్ రెడ్డి ఆరోపించడం సరికాదన్నారు షారుఖ్ షిబ్లీ. వివేకా మరణం తర్వాత గుండెపోటు అని, గొడ్డలితో చంపారని, చంద్రబాబు చంపించాడని.. ఇలా వైసీపీ నేతలు రకరకాలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారాయన. వివేకా హత్య కేసులో షేక్ దస్తగిరి అప్రూవర్ గా మారి వాస్తవాలను ప్రపంచానికి తెలియజేశాడని చెప్పారు షారుఖ్.

షారుఖ్ షిబ్లి అనే వ్యక్తి ఎవరు, అవినాష్ రెడ్డి ఆరోపణలను మొత్తం ముస్లిం సమాజానికి ఆపాదించాలా అనే విషయం పక్కనపెడితే.. ప్రస్తుతానికి టీడీపీ అనుకూల మీడియా మాత్రమే ఈ ఎపిసోడ్ ని హైలెట్ చేస్తోంది. అవినాష్ రెడ్డి మాటలతో మైనార్టీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాని చెబుతోంది. మైనార్టీ మహిళ గురించి అవమాకరంగా మాట్లాడారంటూ అవినాష్ రెడ్డిపై ఆరోపణలు చేస్తోంది. వివేకా హత్య కేసులో ఈ కొత్త ట్విస్ట్ ముందు ముందు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.

First Published:  19 April 2023 5:59 AM GMT
Next Story