Telugu Global
Andhra Pradesh

''ఏం ఖర్మరా! బాబూ'' అనబోతున్న టీడీపీ శ్రేణులు

ఊరూరా రచ్చబండ తరహాలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారని చెబుతున్నారు. అక్కడికి వచ్చి ప్రజలు తమకున్న ఇబ్బందులను వివరించవచ్చని టీడీపీ చెబుతోంది.

ఏం ఖర్మరా! బాబూ అనబోతున్న టీడీపీ శ్రేణులు
X

బాదుడే బాదుడు అంటూ హడావుడి చేసిన టీడీపీ, ఇప్పుడు కొత్త పేరుతో మరో ప్రయత్నం చేయబోతోంది. ఆ కార్యక్రమం పేరు కూడా కాస్త చిత్రంగానే ఉంది. ''ఏం ఖర్మరా! బాబూ'' అని ప్రాథమికంగా నామకరణం చేశారు. జగన్‌ సీఎం అయిన తర్వాత ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని.. వారంతా తమకు ఇదేం ఖర్మరా బాబూ అనుకుంటున్నారని.. అందుకే టీడీపీ చేసే కొత్త పోరాటానికి ఈ పేరు పెట్టినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

ఊరూరా రచ్చబండ తరహాలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారని చెబుతున్నారు. అక్కడికి వచ్చి ప్రజలు తమకున్న ఇబ్బందులను వివరించవచ్చని టీడీపీ చెబుతోంది. ప్రజలు తన కష్టాలను బయటి ప్రపంచానికి చెప్పుకునేందుకు ఒక వేదికగా ''ఏం ఖర్మరా! బాబూ'' నిలుస్తుందని టీడీపీ అంచనా వేస్తోంది. ప్రజలు తమ సమస్యలను చెప్పగానే.. వారి తరపున అక్కడే వినతిపత్రాన్ని కూడా తయారు చేయించి.. బాధితుల సంతకాలు తీసుకుని సంబంధిత అధికారులకు ఆ వినత్రిపత్రాన్ని చేరవేసేలా రూపకల్పన చేశారు.

మూడు నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని టీడీపీ భావిస్తోంది. అయితే ''ఏం ఖర్మరా! బాబూ'' అన్న టైటిల్‌ రివర్స్‌ అవుతుందా అన్న చర్చ కూడా టీడీపీలో నడుస్తోంది.

First Published:  8 Nov 2022 4:37 AM GMT
Next Story