Telugu Global
Andhra Pradesh

అధినాయకుడి దృష్టిలో పడాలా..? అన్న క్యాంటీన్ పెట్టెయ్..

ఈ దశలో ఎన్నికలకు మరో రెండేళ్ల టైమ్ ఉండగా ఇప్పుడు అన్న క్యాంటీన్లు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. పొలిటికల్ ఫైట్ కి కారణం అవుతున్నాయి.

అధినాయకుడి దృష్టిలో పడాలా..? అన్న క్యాంటీన్ పెట్టెయ్..
X

సరిగ్గా అధికారంలోనుంచి దిగిపోయే ముందు అన్న క్యాంటీన్లతో హడావిడి చేశారు చంద్రబాబు. అప్పటికప్పుడు క్యాంటీన్ల నిర్మాణం, ఆహారం సప్లయ్ చేసే సంస్థలకు ఆర్డర్లు.. అదో పెద్ద స్కామ్ అని అంటుంటారు వైసీపీ నేతలు. కానీ అన్న క్యాంటీన్ తో ఏపీలో పేదల ఆకలి కష్టాలన్నీ తీరిపోతాయ్ అన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు చంద్రబాబు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ క్యాంటీన్లు మూతబడ్డాయి. చాలా వరకు వార్డు సచివాలయాలుగా మారిపోయాయి, మరికొన్ని ఇతర అవసరాలకు వినియోగించుకుంటున్నారు. ఈ దశలో ఎన్నికలకు మరో రెండేళ్ల టైమ్ ఉండగా ఇప్పుడు అన్న క్యాంటీన్లు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. పొలిటికల్ ఫైట్ కి కారణం అవుతున్నాయి.

తెనాలి, మంగళగిరిలో అన్నక్యాంటీన్ల ఏర్పాటు తీవ్ర వివాదానికి కారణమైంది. ఇక కుప్పం విషయానికొస్తే ఫైటింగ్ సీన్లు, అరెస్ట్ లు కూడా చోటు చేసుకున్నాయి. అన్న క్యాంటీన్ అనే బోర్డ్ పెట్టడం, అనుమతి లేదని అధికారులు తీసేస్తే, పేదల నోటి దగ్గర కూడు లాగేస్తున్నారంటూ గొడవ చేయడం.. కామన్ గా మారింది. దీంతో ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లోనూ అన్న క్యాంటీన్ల హడావిడి మొదలైంది.

ఏపీలోని 175 నియోజకవర్గాల పరిధిలో అన్న క్యాంటీన్లు ప్రారంభించబోతున్నట్టు చెబుతున్నారు టీడీపీ నాయకులు. ఇప్పటికే చాలా చోట్ల గొడవలవుతున్నా వారు మాత్రం వెనక్కి తగ్గడంలేదు. పోనీ వారినలా వదిలేద్దామని ప్రభుత్వం కూడా అనుకోవడంలేదు. ఒకవేళ ప్రభుత్వం లైట్ తీసుకున్నా.. ప్రధాన కూడళ్లలో క్యాంటీన్లు అంటూ టీడీపీ నేతలు చేస్తున్న హడావిడికి అధికారులు అడ్డుపడాల్సి వస్తోంది. మొత్తమ్మీద అన్న క్యాంటీన్ అంటే అది పట్టడెన్నం పెట్టడానికి కాదు, పుట్టెడు వివాదాలకోసం అన్నట్టుగా మారింది.

ముందు ప్రచారం..

అన్న క్యాంటీన్లో ఎంతమందికి, ఎంతమేర అన్నం పెడుతున్నారో కానీ, ప్రచార ఆర్భాటం మాత్రం బాగా జరుగుతోంది. అన్న క్యాంటీన్ పెట్టి, నాలుగు ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టి, టీడీపీ అకౌంట్లకు ట్యాగ్ చేసి.. ప్రచారం చేసుకుంటున్నారు నేతలు. అధినాయకుడి దృష్టిలో పడాలంటే అన్న క్యాంటీనే అత్యుత్తమ మార్గం అనుకుంటున్నారు నాయకులు. మూడేళ్లుగా టీడీపీలో స్తబ్దుగా ఉన్న నేతలు కూడా ఇప్పుడు హడావిడిగా అన్న క్యాంటీన్ అంటూ తెరపైకి వస్తున్నారు. క్యాంటీన్ కొనసాగినా వార్తే, తీసేసినా వార్తే. తీసేస్తేనే కావాల్సినంత అదనపు ప్రచారం వస్తుంది. పేదల వ్యతిరేకి వైసీపీ అనే ముద్ర వేయొచ్చు. అందుకే ఏపీలో అన్నక్యాంటీన్ల ఏర్పాటు ఇప్పుడు జోరందుకుంది.

First Published:  7 Sep 2022 5:48 AM GMT
Next Story