Telugu Global
Andhra Pradesh

మూడో దఫా చర్చల్లోనూ దిగిరాని అంగన్‌వాడీలు

విధుల్లో చేరకుంటే నిబంధనల ప్రకారం కొత్తవారిని నియమించాల్సి ఉంటుందని చెప్పారు. ప్రజల అవసరాలకు అనుగుణంగానే ప్రభుత్వం పనిచేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

మూడో దఫా చర్చల్లోనూ దిగిరాని అంగన్‌వాడీలు
X

సమ్మె బాట పట్టిన అంగన్‌వాడీ సంఘాల‌ నేతలతో ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం చేపట్టిన మూడో దఫా చర్చల్లో కూడా అంగన్‌వాడీ దిగిరాలేదు. తమ డిమాండ్లలో ప్రధానమైన జీతాల పెంపుపైనే వారు పట్టుబట్టి కూర్చున్నారు. దీంతో మూడో దఫా చర్చలు కూడా విఫలమయ్యాయి. సచివాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలోని కమిటీ పాల్గొంది.

సమావేశం అనంతరం ఈ చర్చలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరులకు వెల్లడించారు. ప్రభుత్వం మూడు దఫాలుగా అంగన్‌వాడీలతో చర్చించిందని, సమస్యలు పరిష్కరించే ఉద్దేశం ఉంది కాబట్టే చర్చలు జరిపామని ఆయన తెలిపారు. వారి డిమాండ్లలో కొన్నింటిని నెరవేరుస్తామని చెప్పామన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం జగన్‌ నెరవేర్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే జీతాలు పెంచామని ఆయన తెలిపారు. ఐదేళ్లకోసారి జీతాలు పెంచాలనేది నిబంధన అని.. వచ్చే జూలైలో జీతాలు పెంచుతామని కూడా ఈ చర్చల్లో అంగన్‌వాడీలకు వివరించామని చెప్పారు. అంగన్వాడీల టీఏ, డీఏలు కూడా ఫిక్స్‌ చేస్తున్నామని, ప్రభుత్వం వైపు నుంచి సానుకూలంగా వ్యవహరించామని తెలిపారు. వారి సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆయన చెప్పారు.

అంగన్‌వాడీల సమ్మె వల్ల గర్భిణులు, పసిబిడ్డలకు ఇబ్బంది కలగకూడదనే వారిని ఎస్మా పరిధిలోకి తెచ్చామని సజ్జల స్పష్టం చేశారు. ఈ సమ్మె కాలంలో.. అంగన్వాడీ కేంద్రాల్లో ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామన్నారు. అంగన్‌వాడీలు విధుల్లో చేరాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం తరఫున కోరారు. ఈ సమ్మె వెనుక పొలిటికల్‌ ఎజెండా ఉందని, ఆ ఎజెండా వల్ల అంగన్‌వాడీలు నష్టపోతారని సజ్జల తెలిపారు. వారు విధుల్లో చేరకుంటే నిబంధనల ప్రకారం కొత్తవారిని నియమించాల్సి ఉంటుందని చెప్పారు. ప్రజల అవసరాలకు అనుగుణంగానే ప్రభుత్వం పనిచేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

అయితే దీనిపై అంగన్‌వాడీలు మాత్రం.. తాము ఎస్మాకు భయపడేది లేదని, కొత్తవారిని నియమించుకుంటామన్న బెదిరింపులకు భయపడబోమని చెబుతున్నారు. అంతేకాదు.. ఎస్మా ప్రతులను భోగి మంటల్లో కాలుస్తామని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా వ్యవహరిస్తున్న అంగన్‌వాడీల వెనుక రాజకీయ కోణం ఉందనేది అర్థమవుతోంది. ముందుముందు ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తీసుకుంటుందనేది వేచిచూడాలి.

First Published:  13 Jan 2024 2:59 AM GMT
Next Story