Telugu Global
Andhra Pradesh

బీటెక్ రవి గడ్డం రవి అయిపోతాడేమో ?

టీడీపీ అభ్యర్ధి బీటెక్ రవి బీభత్సమైన శపథం చేశారు. అదేమిటంటే పులివెందులలో గెలిచేంతవరకు తాను గడ్డం తీసేదిలేదని.

బీటెక్ రవి గడ్డం రవి అయిపోతాడేమో ?
X

వచ్చే ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీచేయబోతున్న టీడీపీ అభ్యర్ధి బీటెక్ రవి బీభత్సమైన శపథం చేశారు. అదేమిటంటే పులివెందులలో గెలిచేంతవరకు తాను గడ్డం తీసేదిలేదని. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని గెలిపించిన తర్వాతే గడ్డం తీస్తానని గట్టి శపథమే చేశారు. బీటెక్ రవి శపథాన్ని చూసిన వారంతా బీటెక్ రవి కాస్త గడ్డం రవి అయిపోతారని సరదాగా జోకులేస్తున్నారు. ఎందుకంటే పులివెందులలో ప్రాతినిధ్యం వహిస్తున్నది జగన్మోహన్ రెడ్డి.

ఈ విషయం బీటెక్ రవికి బాగా తెలుసు. ఎందుకంటే టీడీపీ అభ్యర్ధిగా నియోజకవర్గంలో ఎప్పటినుండో పర్యటిస్తున్నారు. పులివెందులలో పార్టీ పెట్టిన దగ్గరనుండి ఇప్పటివరకు టీడీపీ గెలిచిందే లేదు. 1967 నుండి ఇప్పటివరకు 13 ఎన్నికలు జరిగాయి. ఇందులో 11 సార్లు కాంగ్రెస్ గెలిస్తే చివరి రెండు ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. కాంగ్రెస్ లో కూడా 11 సార్లు వైఎస్ కుటుంబం మాత్రమే గెలిచింది. కాంగ్రెస్ గెలిచినా వైపీపీ గెలిచినా అంతా వైఎస్సార్ కుటుంబమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

పులివెందుల నియోజకవర్గంలో ఎంఎల్ఏగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆరుసార్లు గెలిచారు. రెండుసార్లు సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి గెలిచారు. ఒకసారి విజయమ్మ, రెండుసార్లు జగన్ గెలిచారు. ఇలాంటి చరిత్రున్న నియోజకవర్గంలో బీటెక్ రవి ఎలా గెలుద్దామని అనుకున్నారో అర్ధం కావటంలేదు. సరే వైఎస్ కుటుంబం తప్ప మరొకళ్ళు గెలిచేందుకు లేదని ఏమీ చెప్పలేం కానీ అందుకు కనీసం సూచనలు కూడా కనబడటంలేదు.

పులివెందులలో వైఎస్ ఫ్యామిలీ మీద టీడీపీ తరపున ఆరుసార్లు వరసగా సతీష్ కుమార్ రెడ్డే పోటీచేసి ఓడిపోయారు. గతంలో వైఎస్ ఫ్యామిలీని ఓడించిన తర్వాతే గడ్డం తీస్తానని సతీష్ కూడా శపథం చేశారు. తర్వాత అది జరిగేపని కాదని అర్ధమై గడ్డాన్ని భరించలేక చివరకు షేవ్ చేసేశారు. మళ్ళీ ఇపుడు రవి అలాంటి శపథమే చేశారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించి ఓట్లడుగుతానని రవి ప్రకటించారు. మరి బీటెక్ రవి శపథం ఎప్పటికి నెరవేరుతుందో ఏమో.

Next Story