Telugu Global
Andhra Pradesh

బాలకృష్ణ క్షమాపణ చెప్పాలి.. నర్సుపై చేసిన వ్యాఖ్యలివే!

యాక్సిడెంట్‌ అయి ఆస్పత్రికి వచ్చిన వ్యక్తి.. తనకు వైద్యం చేయడానికి వచ్చిన నర్సు గురించి గౌరవప్రదంగా చెప్పాల్సింది పోయి.. దానెమ్మ.. ఆ నర్సు ఏమో అందంగా ఉందంటూ మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.

బాలకృష్ణ క్షమాపణ చెప్పాలి.. నర్సుపై చేసిన వ్యాఖ్యలివే!
X

నటుడు బాలకృష్ణ నోటిదురుసు పదేపదే చర్చనీయాంశమవుతోంది. ఈసారి నర్సులు ఆయనపై ఫైర్ అవుతున్నారు. ఇటీవల అన్‌స్టాపబుల్‌ కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్‌ పాల్గొన్నారు. పవన్‌- బాలకృష్ణ మధ్య నటుడు సాయిధరమ్ తేజ్‌ బైక్‌ యాక్సిడెంట్ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఆ సందర్బంగా బాలకృష్ణ గతంలో ఒకసారి తనకు జరిగిన యాక్సిడెంట్ ఉదంతాన్నిపవన్‌ కల్యాణ్‌కు వివరించే ప్రయత్నం చేశారు.

కాలేజీ రోజుల్లో తాను కూడా బైక్‌లపై ఎక్కువగా తిరిగేవాడినని.. ఒకసారి రోడ్డు క్రాస్ చేస్తుండగా మరో బైకు వేగంగా వచ్చి కొట్టేసిందన్నారు. దాంతో తాను ఎగిరిపడ్డానని.. ఒళ్లంతా రక్తమేనని వివరించారు. తనను ఆస్పత్రికి తీసుకెళ్లారని.. అక్కడ యాక్సిడెంట్‌ అని చెప్పొద్దు.. కాలుజారి కిందపడ్డా అని చెప్పాల్సిందిగా స్నేహితులు సలహా ఇచ్చారన్నారు.

ఆ సమయంలో చికిత్స చేయడానికి వచ్చిన ఒక నర్సును ఉద్దేశించి '' దానెమ్మ.. ఆ నర్సు ఏమో భలే అందంగా ఉంది. ముఖం క్లీన్‌ చేస్తూ ఏమైంది? అంది. నేనేమో యాక్సిడెంట్‌ అయిందని చెప్పేశా. గెట్‌ అవుట్‌ అనేశారు'' అంటూ బాలకృష్ణ మాట్లాడారు.

ఈ మాటలే నర్సులకు ఆగ్రహం తెప్పించాయి. యాక్సిడెంట్‌ అయి ఆస్పత్రికి వచ్చిన వ్యక్తి.. తనకు వైద్యం చేయడానికి వచ్చిన నర్సు గురించి గౌరవప్రదంగా చెప్పాల్సింది పోయి.. దానెమ్మ.. ఆ నర్సు ఏమో అందంగా ఉందంటూ మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. వెంటనే బాలకృష్ణ నర్సులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆంధ్రప్రదేశ్‌ నర్సింగ్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. పవన్‌ కల్యాణ్ వద్ద బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఖండించారు.

First Published:  5 Feb 2023 3:04 AM GMT
Next Story