Telugu Global
Andhra Pradesh

విధి చిన్న చూపు..ప్రేమ కథ విషాదాంతం..!

ఆ ఇద్దరు ప్రేమికులకు ధైర్యం ఎక్కువే. తమ ప్రేమ వివాహానికి ఇంట్లో ఒప్పుకోకపోయినా.. పెళ్ళికి ఒకరోజు ముందు ఇంటి నుంచి పారిపోయారు. వాళ్ళు ఒకరికి ఒకరు దగ్గరయ్యేందుకు తెగువ చూపించినా విధి మాత్రం కనికరించలేదు.

మెర్సీ, పోతురాజు
X

మెర్సీ, పోతురాజు

ఆ ఇద్దరు ప్రేమికులకు ధైర్యం ఎక్కువే. తమ ప్రేమ వివాహానికి ఇంట్లో ఒప్పుకోకపోయినా.. పెళ్ళికి ఒకరోజు ముందు ఇంటి నుంచి పారిపోయారు. వాళ్ళు ఒకరికి ఒకరు దగ్గరయ్యేందుకు తెగువ చూపించినా విధి మాత్రం కనికరించలేదు. ప్రమాదం రూపంలో యువకుడిని బలిగొనగా.. తీవ్ర గాయాలతో యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం చెరువూరుకు చెందిన పోతురాజు, గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మెర్సీ ఒక స్పిన్నింగ్ మిల్లులో కార్మికులుగా పని చేసేవారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య మొదలైన పరిచయం ప్రేమగా మారింది.

కొంతకాలం తర్వాత మెర్సీకి పెళ్లి చేసేందుకు ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. దీంతో ఆ ప్రేమికులు తమ ప్రేమ విషయాన్ని తమ తమ ఇళ్లలో పెద్దలకు చెప్పారు. అయితే వారు ప్రేమ వివాహానికి అంగీకారం తెలపలేదు. మెర్సీకి ఈ నెల 19వ తేదీన వేరే యువకుడితో పెళ్లి జరిపించేందుకు కుటుంబీకులు ఏర్పాట్లు చేశారు. దీంతో మెర్సీ పెళ్లికి ఒక రోజు ముందు తాను ప్రేమించిన యువకుడితో ఇంటి నుంచి వెళ్లిపోయింది.

మెర్సీ తల్లిదండ్రులు తమ కుమార్తె అదృశ్యమైందని తెనాలి టూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు పోతురాజు, మెర్సీ చెరువూరులో ఉన్నట్లు తెలుసుకుని వారికి ఫోన్ చేశారు. విచారణ కోసం స్టేషన్ కు రావాలని పిలిచారు. దీంతో ప్రేమ జంట పోలీస్ స్టేషన్ కు బైక్ పై బయలుదేరింది.

మార్గమధ్యలో వీరవల్లి సమీపంలో ప్లై ఓవర్ బ్రిడ్జిపై వెళ్తున్న సమయంలో పోతురాజుకు ఫోన్ రాగా, వాహనం నడుపుతూనే మాట్లాడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పి బ్రిడ్జి పిట్ట గోడను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రేమికులు బ్రిడ్జిపై నుంచి ఎగిరిపడి కింద ఉన్న సర్వీస్ రోడ్డుపై పడ్డారు. ఈ ప్రమాదంలో పోతురాజు అక్కడికక్కడే మృతి చెందగా.. మెర్సీ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను పోలీసులు చికిత్స నిమిత్తం విజయవాడ ఆస్పత్రికి తరలించారు. పోతు రాజు, మెర్సీ ప్రేమించుకొని ఒక్కటి అయ్యేందుకు తెగువ చూపినా..విధి ప్రమాదం రూపంలో ఒకరిని బలిగొంది. ఆ జంటను విడదీసింది. ఈ సంఘటన ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

First Published:  25 Aug 2022 6:38 AM GMT
Next Story