Telugu Global
Andhra Pradesh

ఏపీ బీజేపీని అధిష్టానం సైడ్ చేస్తోందా? రాష్ట్ర నాయకులపై నమ్మకం లేదా?

పవన్ కల్యాణ్ భేటీని పూర్తిగా పీఎంవో, జాతీయ నాయకత్వమే డీల్ చేశాయి. భేటీ ఫిక్స్ చేసి మీడియాకు లీకులు ఇచ్చారు. కానీ, రాష్ట్ర నాయకులకు మాత్రం ఈ విషయంలో సమాచారం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఏపీ బీజేపీని అధిష్టానం సైడ్ చేస్తోందా? రాష్ట్ర నాయకులపై నమ్మకం లేదా?
X

బీజేపీ జాతీయ నాయకత్వానికి పలు రాష్ట్రాల్లోని నాయకులపై నమ్మకం లేనట్లే కనపడుతోంది. ఇటీవల ఫామ్‌హౌస్ ఆపరేషన్‌లో పట్టుబడిన ముగ్గురు నిందితుల కాల్ రికార్డ్స్ విన్నప్పుడు తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పని లేదు. రాష్ట్ర నాయకులను సైడ్ చేసి ఈ డీల్ చేస్తున్నాము అనే వ్యాఖ్యలు వినిపించాయి. రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి రాష్ట్ర నాయకత్వాన్ని పూర్తిగా పక్కకు పెడుతున్నట్లు ఈ సంఘటన ద్వారా తెలిసిపోతోంది. ఏపీ రాష్ట్ర నాయకత్వం పరిస్థితి కూడా ఇలాగే ఉన్నది.

ఏపీ బీజేపీ నాయకుల మాటలను జాతీయ నాయకులు ఏనాడూ పట్టించుకున్న దాఖలాలు లేవు. జనసేనతో పొత్తు పెట్టుకుందాము, టీడీపీ వద్దని పలుమార్లు విజ్ఞప్తి చేసినా అధిష్టానం పట్టించుకోవడం లేదు. ఇక పవన్ కల్యాణ్ విషయాన్ని నేరుగా అధిష్టానమే డీల్ చేస్తోంది. కీలక విషయాలు రాష్ట్ర నాయకులకు చెబితే.. అవి బయటకు తెలుస్తున్నాయనే.. అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తున్నది. విశాఖపట్నం పర్యటనకు రానున్న ప్రధాని మోడీతో పవన్ కల్యాణ్ భేటీ కానున్న విషయం రాష్ట్ర నాయకత్వానికి తెలియక పోవడం గమనార్హం. అసలు ప్రధాని పర్యటనలో ఎవరెవరు కలుస్తున్నారన్న విషయంపై కూడా రాష్ట్ర నాయకత్వానికి స్పష్టత లేదు.

పవన్ కల్యాణ్ భేటీని పూర్తిగా పీఎంవో, జాతీయ నాయకత్వమే డీల్ చేశాయి. భేటీ ఫిక్స్ చేసి మీడియాకు లీకులు ఇచ్చారు. కానీ, రాష్ట్ర నాయకులకు మాత్రం ఈ విషయంలో సమాచారం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీవీల్లో చూసిన తర్వాత రాష్ట్ర నాయకులు అధిష్టానాన్ని సంప్రదించారని, ఆ తర్వాత వాళ్లకు అధికారికంగా సమాచారం అందినట్లు తెలుస్తున్నది. చివరకు గురువారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో అధికారికంగా ప్రకటించారు. గత కొంత కాలంగా ఏపీ బీజేపీ నాయకత్వంపై కేంద్ర నాయకత్వం గుర్రుగా ఉన్నది. అధ్యక్షుడు సోము వీర్రాజుతో ఇతర సీనియర్ నాయకుల విభేదాలు అధిష్టానానికి ఆగ్రహం తెప్పించాయి. గత నాలుగుళ్లలో పార్టీ అభివృద్ధికి రాష్ట్ర నాయకులు చేసిన ప్రయత్నాలు ఏవీ లేవని కూడా కోపంతో ఉన్నది.

గతంలో పవన్ కల్యాణ్ కూడా రాష్ట్ర నాయకుల వల్ల ఏమీ కాదని చెప్పుకొచ్చారు. రాష్ట్ర సమస్యలను తాను నేరుగా బీజేపీ అధిష్టానంతోనే మాట్లాడుతున్నానని.. రాష్ట్ర నాయకులతో సంబంధం లేదని వ్యాఖ్యానించారు. అప్పట్లో పవన్ చేసిన ఈ ప్రకటన బీజేపీ రాష్ట్ర నాయకులకు ఆగ్రహం తెప్పించింది. కానీ నేరుగా అధిష్టానంతో టచ్‌లో ఉండటంతో పవన్‌ చేసిన వ్యాఖ్యలను ఖండించలేక పోయారు.

బీజేపీ గత కొన్నాళ్లుగా రాష్ట్ర నాయకత్వానికి సమాచారం లేకుండానే పలు విషయాలు డీల్ చేస్తోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నాయకులను సైడ్ చేసి తామే పూర్తిగా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళలో ఈ పద్దతిని అవలంభిస్తున్నట్లు నాయకులు చెప్తున్నారు. రాష్ట్ర నాయకులు కొన్ని కీలక విషయాలను డీల్ చేయడంలో విఫలమవుతున్నారని భావించే.. ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. స్థానిక నాయకత్వానికి తెలియకుండా అనేక నిర్ణయాలు తీసుకుంటున్నా ఎవరూ ఒక్క మాట కూడా అనలేకపోతున్నారు. విశాఖ పర్యటన విషయంలో కూడా చాలా విషయాలు రాష్ట్ర నాయకులకు తెలియకుండానే ఫిక్స్ అయ్యాయి. ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో పార్టీని నడిపించడం కష్ట‌మని.. ప్రజల వద్ద చులకన అవుతామని నాయకులు వాపోతున్నారు. మమ్మల్ని సంప్రదించకుండా అన్నీ జాతీయ నాయకులే పూర్తి చేస్తుంటే.. ఇక్కడ తాము కార్యకర్తల్లా మారిపోవల్సిన పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానిస్తున్నారు.

First Published:  11 Nov 2022 7:36 AM GMT
Next Story