Telugu Global
Andhra Pradesh

నేను ఎమ్మెల్యే అనిల్ ని.. అయితే మాకేంటి..?

ఆంధ్రప్రదేశ్ మంత్రి కాకాణి పీఏకి లోన్ రికవరీ ఏజెంట్లు ఫోన్ చేసి బెదిరించడం, వారి ఫిర్యాదుతో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసిన ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే నెల్లూరు జిల్లాకే చెందిన ఎమ్మెల్యే అనిల్ కి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది.

నేను ఎమ్మెల్యే అనిల్ ని.. అయితే మాకేంటి..?
X

మంత్రి కాకాణి పీఏకి లోన్ రికవరీ ఏజెంట్లు ఫోన్ చేసి బెదిరించడం, వారి ఫిర్యాదుతో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసిన ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే నెల్లూరు జిల్లాకే చెందిన ఎమ్మెల్యే అనిల్ కి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇక్కడ ఎమ్మెల్యే అనిల్ కి నేరుగా లోన్ రికవరీ ఏజెంట్లు ఫోన్ చేయడం విశేషం. తాను ఎమ్మెల్యేనని చెప్పినా, లోన్ తీసుకున్న వ్యక్తికి తనకు సంబంధం ఏమీ లేదని వివరించినా కూడా రికవరీ ఏజెంట్ తగ్గకపోవడం మరింత విశేషం. మరింత రెట్టించి లోన్ తీసుకుని వాడుకున్నాక కట్టాల్సిన బాధ్యత లేదా అంటూ ఎమ్మెల్యేనే ప్రశ్నించింది ఆ యువతి. ఎమ్మెల్యే ఘాటుగా బదులిచ్చినా కూడా ఆ యువతి వెనక్కు తగ్గలేదు, మరింత రెట్టించింది, 8 లక్షలు డబ్బులు డిమాండ్ చేసింది.

మంత్రులు, ఎమ్మెల్యేలకే ఎందుకు ఫోన్లు..?

నెల్లూరుకు చెందిన అశోక్ అనే వ్యక్తి ఫుల్లట్రాన్ సంస్థలో 8 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నాడు. అతను సకాలంలో తిరిగి చెల్లించకపోవడంతో ఆ సంస్థ చెన్నైకి చెందిన కోల్ మ్యాన్ అనే రికవరీ ఏజెన్సీకి ఈ బాధ్యతను అప్పగించింది. ఆ సంస్థ ప్రతినిధులు నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖుల్ని ఎంచుకున్నారు. ఇంటర్నెట్ లో కాకాణి, అనిల్ ఫోన్ నెంబర్లు సేకరించారు. అప్పు తీసుకున్న వ్యక్తి మిమ్మల్ని షూరిటీగా పెట్టారంటూ వారిద్దరినీ హడావిడి పెట్టారు. వారిద్దరితో సదరు లోన్ తీసుకున్న వ్యక్తికి ఫోన్ చేయించి బెదిరించాలనేది రికవరీ ఏజెంట్ల పన్నాగం. అయితే కాకాణి పీఏ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయించడంతో నలుగురిని అరెస్ట్ చేశారు. అనిల్ ఫోన్ కాల్ వ్యవహారంలో మాత్రం పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.

ఇటీవల రికవరీ ఏజెంట్ల ఫోన్ కాల్స్ కి, మార్ఫింగ్ ఫొటోల దెబ్బకు తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు తెలిసిందే. తాజాగా ఎమ్మెల్యే అనిల్ ఫోన్ కాల్ రికార్డింగ్ బయటకు వచ్చిన తర్వాత ఏజెంట్లు ఏ స్థాయిలో బెదిరిస్తారో అర్థమవుతోంది. తాము అప్పు తీసుకోలేదు, అప్పు తీసుకున్నవారికీ తమకు సంబంధం లేదని చెబుతున్నా కూడా.. ఇద్దరూ కలిసే వాడుకున్నారు కదా అంటూ బెదిరించడం మొదలు పెట్టారు. అవతలివారిని రెచ్చగొట్టేలా, వారి పరువు తీసేలా మాట్లాడటం, మాటలతోనే హింసించడం, నెంబర్లు మార్చి మార్చి ఒకేరోజు వందకి పైగా కాల్స్ చేయడం రికవరీ ఏజెంట్ల పని. ఇప్పుడిలా ప్రజా ప్రతినిధుల ఫోన్ నెంబర్లు సేకరించి కొత్త నాటకానికి తెరతీయడం మొదలైంది.

First Published:  29 July 2022 4:33 PM GMT
Next Story