Telugu Global
Andhra Pradesh

అప్పులపై ఆధారపడుతున్న ఆంధ్రప్రదేశ్‌

ఏపీ స్థాయిలో తొలి ఆరు నెలల్లో అప్పును మరే రాష్ట్రం చేయలేదు. కనీసం దరిదాపుల్లో కూడా ఏ రాష్ట్రం లేదు. ఏపీ తర్వాత 30వేల 407 కోట్ల రూపాయలను తొలి ఆరు నెల్లలో బీహర్ చేసింది.

అప్పులపై ఆధారపడుతున్న ఆంధ్రప్రదేశ్‌
X

దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగానే అప్పులు చేస్తోంది. సరైన వనరులు లేకపోవడం, భారీగా పథకాలు అమలు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అధికంగా అప్పుల మీదే ఆధారపడాల్సి వస్తోంది. ప్రస్తుతం తొలి ఆరు నెలల్లో ఏపీ చేసిన అప్పు ఆ విషయాన్ని స్పష్టం చేస్తోంది.

2022-23 ఆర్థిక ఏడాదికి గాను ఏడాది మొత్తం మీద 48వేల కోట్ల రూపాయల అప్పు సమీకరిస్తామని బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆ పరిధిని ఆరు నెలల్లోనే ఏపీ దాటేసింది. ఏడాదికి తెచ్చే అప్పును 48,724 కోట్లుగా బడ్జెట్‌లో చూపారు. తొలి ఆరు నెలల్లోనే 49,263 కోట్ల రూపాయలను అప్పుగా ఏపీ తెచ్చుకుంది. కాగ్‌ నివేదికలో ఈ విషయం వెల్లడైంది.

ఏపీ స్థాయిలో తొలి ఆరు నెలల్లో అప్పును మరే రాష్ట్రం చేయలేదు. కనీసం దరిదాపుల్లో కూడా ఏ రాష్ట్రం లేదు. ఏపీ తర్వాత 30వేల 407 కోట్ల రూపాయలను తొలి ఆరు నెల్లలో బీహర్ చేసింది. బీహర్‌ కూడా ఏడాదిలో 25,885 కోట్లు అప్పు తెస్తామని బడ్జెట్లో చెప్పినప్పటికీ ఆరు నెలల్లోనే ఆ అంచనాలు దాటేసింది.

మరే రాష్ట్రం కూడా బడ్జెట్‌లో ప్రతిపాదించిన అప్పు మోతాదును దాటలేదు. ఈ ఏడాది 52వేల కోట్ల రూపాయలు అప్పు తేవాల్సి ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించింది. కానీ తొలి ఆరునెలల్లో 21వేల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు తెచ్చింది. తమిళనాడు 96వేల కోట్ల రూపాయల అప్పును ప్రతిపాదించినప్పటికీ తొలి ఆరు నెలల్లో కేవలం 18, 726 కోట్లు మాత్రమే అప్పు తెచ్చింది.

బెంగాల్‌ బడ్జెట్‌లో ఏడాది అప్పును 62వేల కోట్లుగా ప్రతిపాదించినప్పటికీ.. తొలి ఆరు నెలల్లో 26వేల కోట్లు మాత్రమే అప్పు చేసింది. ఒక్క ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే భారీగా అప్పులు చేస్తూ వెళ్తోంది. ఆదాయ మార్గాలు తక్కువగా ఉండడం, ఖర్చులు, పథకాలు భారీగా ఉండడం, కేంద్రం నుంచి సరైన సహకారం లేకపోవడం వల్లనే ఏపీ ప్రభుత్వం ఈస్థాయిలో అప్పులు చేయాల్సి వస్తోంది.

First Published:  17 Nov 2022 3:25 AM GMT
Next Story