Telugu Global
Andhra Pradesh

తీరని అన్యాయం.. పుండుపై కారం చల్లుతున్న షర్మిల

కాంగ్రెస్‌ నిర్వాకం వల్ల రాష్ట్రంలో రాజధాని సమస్య రగులుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్‌ పునర్ వ్య‌వ‌స్థీకరణ చట్టంలో రాజధాని గురించి ప్రస్తావించలేదు. దాంతో రాష్ట్రానికి ఇప్పటి వరకు స్థిరమైన రాజధాని లేకుండా పోయింది.

తీరని అన్యాయం.. పుండుపై కారం చల్లుతున్న షర్మిల
X

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగి పదేళ్లు పూర్తి కావడానికి ఇంకా కొన్ని నెలలు మాత్రమే మిగిలున్నాయి. విభ‌జిత ఆంధ్రప్రదేశ్‌కు అయిన గాయం ఇంకా మాన‌లేదు. ఇటువంటి స్థితిలో వైఎస్‌ షర్మిల ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్ష పదవిని చేపట్టారు. తెలంగాణలో రాజకీయాలు చేసి విఫలమైన షర్మిల ఆంధ్రప్రదేశ్‌లోకి అడుగు పెట్టారు. పీసీసీ అధ్యక్షురాలిగా ఆమె పెద్ద బరువునే భుజాల మీద వేసుకున్నారు. రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. నాయకులు, కార్యకర్తలు పార్టీకి దూరమయ్యారు. గత ఎన్నికల్లో కేవలం ఒక శాతం ఓట్లతో కాంగ్రెస్‌ సరిపెట్టుకుంది. ఇప్పుడు తన ఓట్ల శాతాన్ని పెంచుకుంటుందనేది కల్ల. అందుకు స్వయంకృతాపరాధమే కారణం.

కాంగ్రెస్‌ నిర్వాకం వల్ల రాష్ట్రంలో రాజధాని సమస్య రగులుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్‌ పునర్ వ్య‌వ‌స్థీకరణ చట్టంలో రాజధాని గురించి ప్రస్తావించలేదు. దాంతో రాష్ట్రానికి ఇప్పటి వరకు స్థిరమైన రాజధాని లేకుండా పోయింది. అది రాష్ట్ర రాజకీయాల్లో మంటపెట్టింది. అనువుగాని అమరావ‌తి ప్రాంతాన్ని చంద్రబాబు తన పాలనలో రాజధానిగా ఎంపిక చేసుకుని భూదందా నడిపారు. కేంద్రం నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును తన చేతుల్లోకి తీసుకుని దాని నిర్మాణ వ్యయాన్ని అమాంతం పెంచేసి కోట్ల రూపాయలు తన వారికి దోచిపెట్టారు. బాబు హ‌యాంలో దాని నిర్మాణం అంగుళం కూడా కదల్లేదు. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి పెట్టారు. ప్రజలకు చేసిన మేలు కూడా ఏమీ లేదు. ఇటువంటి పరిస్థితిలో వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చారు.

తాను ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత జగన్‌ ప్రజల గాయాలపై మలాం రాయడానికి పూనుకున్నారు. అందుకు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాల ఫలితాలు అందుతున్నాయి. గ్రామీణ ప్రజల జీవితాల్లో సానుకూలమైన చలనం చోటు చేసుకుంది, పోలవరం ప్రాజెక్టుపై కేంద్రంతో ఆయన ఒప్పందం చేసుకుని దాన్ని పూర్తి చేయడానికి పూనుకున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు వివక్షకు గురవుతున్నామనే భావన రాకుండా అధికారాన్ని మూడు ప్రాంతాలకు విస్తరించడానికి పూనుకున్నారు. అందుకు మూడు రాజధానుల ఆలోచనను ముందుకు తెచ్చి అమలు చేయడానికి ప్రయత్నించారు. దానికి ఎప్పటిప్పుడు చంద్రబాబు అడ్డుపడుతూ వచ్చారు. ఈ విషయాలను పట్టించుకోకుండా షర్మిల కేవలం వైఎస్‌ జగన్‌ మీద విమర్శలు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాకు చంద్రబాబు పాతరేశారు. ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించి ప్రత్యేక హోదా డిమాండ్‌ను పక్కన పడేశారు. ఒక పార్టీ దిగిపోయి మరో పార్టీ అధికారంలోకి రావచ్చు గానీ, ప్రభుత్వం అనేది అవిచ్ఛిన్నమైన, నిరంతరాయమైన ప్రక్రియ. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చంద్రబాబుతో ప్రారంభమై జగన్‌తో కొనసాగుతోంది. అయినప్పటికీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడానికి తన వంతు ప్రయత్నం జగన్‌ చేస్తూనే ఉన్నారు. ఎంతగా పోరాటం చేసినప్పటికీ నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగివచ్చే పరిస్థితి లేదు. ఒక ఆంధ్రప్రదేశ్‌ విషయంలోనే కాదు, ఏ రాష్ట్రం విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం తాను అనుకున్నదే చేస్తోంది తప్ప కిందికి దిగడం లేదు. ఇటువంటి పరిస్థితిలో రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించడం సాధ్యమయ్యే పని కాదు.

ఇటువంటి స్థితిలో జగన్‌ ప్రభుత్వంపై షర్మిల చేస్తున్న విమర్శలను పట్టించుకుని ప్రజలు కాంగ్రెస్‌ వైపు మళ్లడం అనేది జరిగే పని కాదు. విభజన గాయానికి ప్రధాన కారణం కాంగ్రెస్‌ పార్టీ. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని షర్మిల చెబుతున్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. అందువల్ల షర్మిల విమర్శ‌లను, హామీలను విశ్వసించి ప్రజలు కాంగ్రెస్‌ను తలకెత్తుకుంటారనేది భ్రమ మాత్రమే.

వైఎస్‌ జగన్‌ నాయకత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఓట్లను చీల్చి షర్మిల చంద్రబాబు నాయకత్వంలోని టిడిపికి సహకరిస్తారనే అభిప్రాయం ఒకటి ఉంది. అయితే షర్మిల ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే అవకాశాలే ఎక్కువ. దాని వల్ల చంద్రబాబు ప్రయత్నాలు మొదటికి మోసం తేవచ్చు.

First Published:  30 Jan 2024 9:40 AM GMT
Next Story