Telugu Global
Andhra Pradesh

మాధవ్ పై చర్యలు తీసుకోలేరు కానీ, నన్ను డిస్మిస్ చేస్తారా..?

జూన్ 14న ఏపీ సీఎం జగన్, సత్యసాయి జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో.. అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద ఏఆర్ కానిస్టేబుల్ భానుప్రకాష్ ప్లకార్డులు పట్టుకుని తన ఆవేదన తెలియజేశారు.

మాధవ్ పై చర్యలు తీసుకోలేరు కానీ, నన్ను డిస్మిస్ చేస్తారా..?
X

జూన్ 14న ఏపీ సీఎం జగన్, సత్యసాయి జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో.. అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద ఏఆర్ కానిస్టేబుల్ భానుప్రకాష్ ప్లకార్డులు పట్టుకుని తన ఆవేదన తెలియజేశారు. పోలీసులకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని, సీఎం తమ మొర ఆలకించాలని ప్లకార్డులపై రాసుకుని అక్కడ ప్రదర్శించారు. సీఎం జగన్ జిల్లాకు వచ్చిన సమయంలో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. అప్పటికప్పుడు అతనిపై చర్యలు తీసుకోడానికి వెనకాడిన ఉన్నతాధికారులు.. ఇప్పుడు పాత కేసుల పేరుతో భానుప్రకాష్ ని డిస్మిస్ చేశారు. 2019 జూన్ 22న జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కి వచ్చిన బాధితురాలి దగ్గర 10లక్షల రూపాయల నగదు, 30 తులాల బంగారం.. మోసం చేసి తీసుకున్నారనే అభియోగాలపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. దీంతో ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారింది. తనపై ఓ పథకం ప్రకారం కక్షసాధింపులకు దిగారని ఆరోపిస్తున్నారు భాను ప్రకాష్.

మాధవ్ కి ఓ న్యాయం.. నాకో న్యాయమా..?

ఇటీవల ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంలో ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలుసు. అయితే ఆయనపై చర్యలు తీసుకోడానికి మాత్రం వెనకాడారని, తనను మాత్రం బలిచేశారని అన్నారు భానుప్రకాష్. గోరంట్ల మాధవ్‌ కి లేని శిక్షలు నాకే వర్తిస్తాయా? అని ప్రశ్నించారు. డిస్మిస్‌ వార్తలు రాగానే ప్రతి కానిస్టేబుల్ తనను పరామర్శించారని, తన ఆందోళన వెనక ఎలాంటి రాజకీయ కుట్రలేదన్నారు. పోలీసులకు రావాల్సిన బకాయిలపైనే తాను ప్రశ్నించానన్నారు. న్యాయం జరిగే వరకు పోరాడతానన్నారు.

మానవ హక్కుల కమిషన్ ని ఆశ్రయిస్తా...

తనకు జరిగిన అన్యాయంపై మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేస్తానన్నారు భానుప్రకాష్. అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్పపై కూడా ఆరోపణలున్నాయని, వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. లక్షల రూపాయలు వసూలు చేస్తున్న పోలీసులపై చర్యలు శూన్యం అని అన్నారు. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని జరిగితే ఫకీరప్పే కారణం అని అన్నారు. భానుప్రకాష్ డిస్మిస్, తదనంతర పరిణామాలు ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. గతంలో మీసం మెలేసి తొడగొట్టిన సీఐకి ఏకంగా ఎంపీ టికెట్ ఇచ్చి ప్రోత్సహించిన జగన్, ఇప్పుడు కేవలం ప్లకార్డులు పట్టుకుని తమకు న్యాయం చేయాలన్న కానిస్టేబుల్ పై ఇంత కఠినంగా వ్యవహరిస్తారా అంటూ టీడీపీ నేతలు విమర్శలు మొదలు పెట్టారు.

First Published:  29 Aug 2022 11:05 AM GMT
Next Story