Telugu Global
Andhra Pradesh

ఆనం ఫిక్సయిపోయారా?

వచ్చే ఎన్నికల్లో వెంకటగిరి నుండి మళ్ళీ పోటీ చేసే విషయంలో తనకు టికెట్ దక్కదని ఆనం రామనారాయణరెడ్డి ఫిక్సయిపోయినట్లున్నారు. అందుకనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోటికొచ్చింది మాట్లాడుతున్నారు.

ఆనం ఫిక్సయిపోయారా?
X

మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఫిక్సయిపోయినట్లున్నారు. అందుకనే బహిరంగంగా ప్రభుత్వాన్ని తప్పుపడుతు మాట్లాడుతున్నారు. 'ఏం చేశామని జనాలు వచ్చే ఎన్నికల్లో మనకు ఓట్లేస్తారు' ? అంటు పార్టీ నేతలను డైరెక్టుగా ప్రశ్నించారు. గత ప్రభుత్వం కన్నా వెయ్యిరూపాయలు ఎక్కువ పెన్షన్ ఇచ్చేస్తే జనాలు వైసీపీకి ఓట్లేసేస్తారా అంటు మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి. రోడ్లు వేయలేదు, గుంతల పూడ్చలేదు, అభివృద్ధి కార్యక్రమాలు చేసింది కూడా లేదు అంటూ ఆనం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ఆనం మాట్లాడింది ఎలాగుందంటే జనాలు మనకు ఎందుకు ఓట్లేస్తారు అన్నట్లుగా కాకుండా అసలు మనం జనాలను ఎలా ఓట్లడుగుతాం అన్నట్లుగా ఉంది. ఇక్కడ విషయం ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో వెంకటగిరి నుండి మళ్ళీ పోటీ చేసే విషయంలో తనకు టికెట్ దక్కదని ఫిక్సయిపోయినట్లున్నారు. అందుకనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. మూడు నాలుగు అంశాల్లో మొదటి నుండి ఆనంలో అసంతృప్తి పేరుకుపోయింది.

అవేమిటంటే తనను మంత్రివర్గంలోకి తీసుకోకపోవటం, తన సీనియారిటినీ పార్టీ గుర్తించకపోవటం, పార్టీలో తనను ఎవరు లెక్కచేయకపోవటం, వచ్చేఎన్నికల్లో నెల్లూరు సిటి నుండి పోటీ చేసే అవకాశం దక్కే అవకాశం లేకపోవటం. తనకు జగన్మోహన్ రెడ్డి విపరీతమైన ప్రాధాన్యతిచ్చి మంత్రివర్గంలోకి తీసుకుని నెత్తినపెట్టుకుంటారని ఆనం తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకున్నారు. అయితే అసలు ఆనంను పార్టీలో చేర్చుకుని వెంకటగిరిలో టికెట్ ఇచ్చిందే చాలా ఎక్కువన్నది జగన్ అభిప్రాయం.

అందుకనే ఆనంను మంత్రివర్గంలోకి తీసుకోలేదు. అక్కడ మొదలైన అసంతృప్తి పెరిగిపెరిగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోటికొచ్చినట్లు మాట్లాడేంత స్ధాయికి చేరుకున్నది. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వరని ఆనం నిర్ధారణ చేసుకున్నట్లున్నారు. అందుకనే టీడీపీ నేతలతో కూడా టచ్‌లో ఉన్నారు. సో ఆనం వ్యవహారం గమనించిన తర్వాత ఎన్నికలకు ముందు పార్టీకి రాజీనామా చేసి టీడీపీలోకి జంప్ అయిపోతారనే అనుకుంటున్నారు. ఆనంకు నెల్లూరు సిటీలో పోటీ చేయాలనే కోరిక బలంగా ఉంది. వైసీపీలో అది సాధ్యం కాదు. అందుకనే ఏదో కారణం చూపి పార్టీలో నుండి బయటకు వెళ్ళిపోవాలని అనుకున్నట్లున్నారు. అందుకనే సొంత పార్టీ, ప్రభుత్వంపైనే నోటికొచ్చింది మాట్లాడుతున్నారు.

First Published:  29 Dec 2022 6:30 AM GMT
Next Story