Telugu Global
Andhra Pradesh

నా ఫోన్ కూడ్ ట్యాప్ చేస్తున్నారు.. నన్ను భూమి మీద లేకుండా చేస్తారా..?

తన సెక్యూరిటీ తొలగించి, తన ఫోన్లు ట్యాప్ చేసి చివరకు తనను ఏం చేయదలచుకున్నారని, భూమి మీద లేకుండా చేయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు ఆనం.

నా ఫోన్ కూడ్ ట్యాప్ చేస్తున్నారు.. నన్ను భూమి మీద లేకుండా చేస్తారా..?
X

అధికార పార్టీ ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర ఆరోపణల తర్వాత వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కూడా.. తన ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని చెప్పారు. సొంత పార్టీవారే ఫోన్లు ట్యాప్ చేస్తుంటే తాను ఇంకెవరికి చెప్పుకోవాలన్నారు. ఆఖరికి తన కూతురితో కూడా మాట్లాడుకునే అవకాశం లేదని చెప్పారు. తన ఫోన్లు, తన పీఏ ఫోన్లు కూడా ట్యాపింగ్ కి గురవుతున్నాయని బాంబు పేల్చారు. ఇవేవీ ఆఫ్ ది రికార్డ్ గా చెప్పాల్సిన ఖర్మ తనకు పట్టలేదని, ఆన్ రికార్డ్ గానే చెబుతున్నానంటూ ప్రెస్ మీట్ లో కుండబద్దలు కొట్టారు.

సెక్యూరిటీ తీసేశారు, నన్ను ఏం చేస్తారు..?

గతంలో తనకు నలుగురు గన్ మెన్లు సెక్యూరిటీగా ఉండేవారని, ఇటీవల ఇద్దర్ని తొలగించారని, అందులో ఒకరు రావడం మానేశారని అన్నారు ఆనం. తన సెక్యూరిటీ తొలగించి, తన ఫోన్లు ట్యాప్ చేసి చివరకు తనను ఏం చేయదలచుకున్నారని, భూమి మీద లేకుండా చేయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు ఆనం . వెంకటగిరిలో తన కటౌట్లు తగలబెడుతున్నారని, అసలు ఇలాంటి రాజకీయాలు తానెక్కడా చూడలేదన్నారు.

రాజ్యాంగేతర శక్తులు..

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు రాజ్యాంగేతర శక్తులు చొరబడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు ఆనం రామనారాయణ రెడ్డి. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే ఉన్నా కూడా పార్టీ ఇన్ చార్జ్ గా మరొకర్ని నియమించడం ఏంటని నిలదీశారు. పార్టీ పెట్టిన వ్యక్తి రాజ్యాంగేతర శక్తి కాదా అన్నారు. ఎమ్మెల్యేలను సభలు, సమావేశాలకు రావొద్దని చెబుతున్నారని, రాజ్యాంగేతర శక్తుల్ని పిలుస్తున్నారని చెప్పారు. నాలుగేళ్ల పాలనలోనే వైసీపీ సమర్థతపై ప్రజల్లో చర్చ మొదలవడం దురదృష్టకరం అన్నారు ఆనం. రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీలే అధికారం కోసం పోటీ పడుతున్నాయని, ప్రత్యామ్నాయం కూడా ఉంటే బాగుంటుందని, దీనిపై మేథావులు, జర్నలిస్ట్ లు ఆలోచించాలన్నారు. ప్రజలు పాలనను బేరీజు వేసుకుంటున్నారని, రాబోయే 15 నెలల్లో ఏమైనా జరగొచ్చన్నారు.

వెంకటగిరిలో ఇటీవల చేసిన సర్వేల్లో వైసీపీ పటిష్టంగా ఉందనే నివేదికలు వచ్చాయని, ప్రస్తుతం నాయకుల వారీగా క్యాడర్ విడిపోయిందని, మూడు వర్గాలు ఏర్పడ్డాయని చెప్పారు. ఒక్కొకరు ఒక్కో అవసరాలకోసం ఒక్కో నాయకుడి వెంట వెళ్తున్నారని, పార్టీ బలహీనపడుతోందన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను ఎన్నో ఎత్తు పల్లాలు చూశానని, తాను ఎవరి రాజకీయ భిక్షపై ఆధారపడలేదన్నారు ఆనం.

First Published:  31 Jan 2023 10:44 AM GMT
Next Story