Telugu Global
Andhra Pradesh

నీది శునకానందం 'బ్రో'..

సింక్ అయ్యేలా డ్యాన్స్ లు చేయడానికి తానేమీ డ్యాన్స్ మాస్టర్ ని కాదన్నారు అంబటి. తనని రాజకీయంగా ఎదుర్కోలేక, ఎవరో డబ్బులు పెట్టి తీసిన సినిమాలో తన పాత్రని పెట్టి పవన్ శునకానందం పొందుతున్నారని మండిపడ్డారు అంబటి.

నీది శునకానందం బ్రో..
X

'బ్రో' సినిమాలో శ్యాంబాబు అనే పాత్రతో మంత్రి అంబటి రాంబాబుని ఇమిటేట్ చేయించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మంత్రి అంబటి కూడా ఓ ట్వీట్ వేసి తన ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. అయితే ఆ డోస్ సరిపోలేదనుకున్నారో ఏమో.. ఇప్పుడు ఏకంగా ప్రెస్ మీట్ పెట్టారు. కేవలం 'బ్రో' సినిమాలో తనపాత్రపై జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికే మంత్రి ఈ ప్రెస్ మీట్ పెట్టడం గమనార్హం. రాజకీయంగా తనని ఎదుర్కోలేక ఇలా సినిమాల్లో తన పాత్ర పెట్టి పవన్ శునకానందం పొందుతున్నారని మండిపడ్డారు అంబటి.

రాంబాబు అని పెట్టుకోవచ్చుగా..?

'బ్రో' సినిమాలో శ్యాంబాబు అనే పాత్ర పెట్టి ఇన్ డైరెక్ట్ గా సెటైర్లు వేసే బదులు ధైర్యంగా రాంబాబు అనే పేరు పెట్టుకోవచ్చుగా అని సలహా ఇచ్చారు అంబటి. బ్రో సినిమా తాను చూడలేదని, ఎవరో చెబితే విన్నానని, ఇలాంటి వాటిని తానసలు పట్టించుకోనన్నారు.

పవన్ ఎలాంటివారంటే..?

ఎవరైనా శత్రువులుంటే.. వారి బొమ్మను తయారు చేయించుకుని ఇంట్లో పెట్టుకుని ఆ బొమ్మను కొట్టి సంతోషపడే రకం పవన్ కల్యాణ్ అంటూ సెటైర్లు పేల్చారు అంబటి. ఇక సంక్రాంతికి తాను వేసిన డ్యాన్స్ ని ఆనంద తాండవం అని వివరించారు. స్టూడెంట్ లీడర్ గా రాజకీయాల్లోకి వచ్చిన తను కష్టపడి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యానని, ఆ ఆనందంలో చేసిన డ్యాన్స్ అదని చెప్పారు. తాను ప్రతి ఏడాదీ డ్యాన్స్ చేస్తానని, వచ్చే ఏడాది బోగి రోజు కూడా చేస్తానని, కావాలంటే పవన్ కల్యాణ్ వచ్చి చూడొచ్చన్నారు. ఎవరో ప్యాకేజీ ఇస్తే తాను డ్యాన్స్ లు చేయబోనని, తనకి తాను ఆనందంతో చేస్తానన్నారు.

సింక్ అయ్యేలా డ్యాన్స్ లు చేయడానికి తానేమీ డ్యాన్స్ మాస్టర్ ని కాదన్నారు అంబటి. పవన్ కల్యాణ్ రాజకీయాలకు అస్సలు సింక్ కాడన్నారు. పవన్ సినిమా ఫ్లాప్ కావాలని తాను కోరుకోవడం లేదని, సినిమా రిజల్ట్ ఎలా ఉందో కొందరు చెబితే తెలిసిందన్నారు. తనని రాజకీయంగా ఎదుర్కోలేక, ఎవరో డబ్బులు పెట్టి తీసిన సినిమాలో తన పాత్రని పెట్టి పవన్ శునకానందం పొందుతున్నారని మండిపడ్డారు అంబటి.

First Published:  29 July 2023 9:32 AM GMT
Next Story