Telugu Global
Andhra Pradesh

వైసీపీకి అంబటి రాయుడు రాజీనామా.. అసలేం జరిగింది?

రాయుడికి కండువా కప్పి సీఎం జగన్‌ పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో జాయిన్ అయిన 9 రోజులకే రాయుడు రాజీనామా చేయడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

వైసీపీకి అంబటి రాయుడు రాజీనామా.. అసలేం జరిగింది?
X

భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సంచలన ప్రకటన చేశారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్ర‌క‌టించారు. వైసీపీని వీడుతున్నట్లు చెప్పిన రాయుడు.. కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. గతనెల డిసెంబర్ 28న అధికారికంగా వైసీపీలో జాయిన్ అయ్యారు రాయుడు. తాడేపల్లిలోని క్యాంప్‌ ఆఫీసులో రాయుడికి కండువా కప్పి సీఎం జగన్‌ పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో జాయిన్ అయిన 9 రోజులకే రాయుడు రాజీనామా చేయడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

అంబటి రాయుడుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయించాలనే ఆలోచన ఇప్పటిది కాదు.. రెండేళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. టికెట్ కన్ఫర్మ్‌ అయినా.. గుంటూరు ఎంపీ సీటు లేదా పొన్నూరు ఎమ్మెల్యే టికెట్ విషయంలో పార్టీతో కొన్నాళ్లుగా చర్చలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే గుంటూరుకు చెందిన కొందరు నేతలు అంబటి రాయుడితో టచ్‌లోకి వెళ్లారు. ఎంపీ వద్దని, ఎమ్మెల్యే సీటు బెటర్ అని బ్రెయిన్ వాష్ చేశారు. రాయుడు కూడా పొన్నూరు ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. పొన్నూరు నియోజకవర్గం పరిధిలోనే అంబటి రాయుడు స్వ‌గ్రామం ఉంది.


ఇదంతా సీఎం జగన్‌ వరకు వెళ్లడంతో రాయుడిని స్వయంగా క్యాంప్ ఆఫీసుకు పిలిపించి మాట్లాడారు. ఈ సమయంలోనే పార్టీలోని కొందరు నేతలు, ప్రత్యర్థి టీడీపీ నేతల అభిప్రాయాలను అంబటి రాయుడు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అన్ని విషయాలను విన్న జగన్.. రాజకీయాలు అన్నాక ఇలాంటివి చాలా కామన్ అని రాయుడికి చెప్పారు. సున్నితంగా ఉంటే కుదరదని, తెగింపు ఉండాలన్నారు. రాబోయే రోజుల్లో కుట్రలు, కుతంత్రాలు ఎక్కువ అవుతాయని రాయుడికి హితబోధ చేశారు. అదేరోజు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీగా పోటీ చేస్తేనే బాగుంటుందని చెప్పి పంపారు.

పార్టీ టికెట్ కన్ఫమ్ అవుతున్న సమయంలో అంబటి రాయుడు వైసీపీని వీడటం సంచలనంగా మారింది. అదీ పార్టీలో చేరిన 9 రోజులకే రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయంపై రాయుడిని సంప్రదిస్తే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. బంధువులు సైతం అందుబాటులోకి రాకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

First Published:  6 Jan 2024 7:39 AM GMT
Next Story