Telugu Global
Andhra Pradesh

మా పవన్ మా పవన్ అంటూ కాపులు గోక్కుంటున్నారు..

రాష్ట్రంలో కాపులకు పట్టిన శని పవన్ కల్యాణ్ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు అంబటి రాంబాబు. చంద్రబాబుకు ఊడిగం చేస్తున్న పవన్ దగ్గర ఉంటారో, జగన్ ని నమ్ముకున్న అంబటి వెంట ఉంటారో కాపులు తేల్చుకోవాలని సూచించారు.

మా పవన్ మా పవన్ అంటూ కాపులు గోక్కుంటున్నారు..
X

కాపులంతా కలసి మా పవన్, మా పవన్ అంటూ గోక్కుంటున్నారని మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. గోక్కుని.. గోక్కుని చంద్రబాబు దగ్గర పవన్‌ తో కలిసి చాకిరీ చేయండి అంటూ శాపనార్థాలు పెట్టారు. ఒక్కచోట కూడా గెలవలేని పవన్ తనపై ఆరోపణలు చేస్తాడా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కాళ్ల మీద పడి పవన్‌ ను ఏడ్వమని చెప్పండి అన్నారు. తాను విమర్శించినంత ఘాటుగా పవన్ ని ఎవరూ విమర్శించబోరని, అందుకే తనను టార్గెట్‌ చేసుకొని పవన్ ఆరోపణలు చేస్తున్నాడంటూ మండిపడ్డారు అంబటి. పవన్ కాపులను తీసుకెళ్లి చంద్రబాబు దొడ్లో కట్టేసే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు.

కాపులకు పట్టిన శని..

రాష్ట్రంలో కాపులకు పట్టిన శని పవన్ కల్యాణ్ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు అంబటి రాంబాబు. చంద్రబాబుకు ఊడిగం చేస్తున్న పవన్ దగ్గర ఉంటారో, జగన్ ని నమ్ముకున్న అంబటి వెంట ఉంటారో కాపులు తేల్చుకోవాలని సూచించారు. బుద్ధి.. జ్ఞానం లేని పవన్‌ కల్యాణ్‌ కు రాజకీయాలు ఏం తెలుసని ప్రశ్నించారు. వైసీపీని మళ్లీ అధికారంలోకి రానివ్వను, ఓట్లు చీలనివ్వను అంటున్న పవన్.. అంత పెద్ద మగాడా అని ప్రశ్నించారు అంబటి.

నేనెవర్నీ డబ్బులు అడగలేదు..

ఇటీవల ఓ బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తే, అందులో కొంత డబ్బుని అంబటి రాంబాబు అడిగారంటూ బాధిత కుటుంబ సభ్యులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. దీని వెనక జనసేన ప్రోద్బలం ఉందని ఆరోపిస్తున్నారు అంబటి. పవన్ ని గట్టిగా తిట్టేది తానేనని, అందుకే జనసేన నాయకులు తనని టార్గెట్ చేశారని అంటున్నారు.

నీకెందుకు అంత జిల..

అంబటి వ్యాఖ్యలకు జనసేన నుంచి కూడా ఘాటు సమాధానం వచ్చింది. జగన్ అంటే అంత ఇష్టముంటే, ఆయనతోనే ఉండాలని, కాపుల ఊసు అంబటికి ఎందుకని మండిపడ్డారు సత్తెనపల్లి జనసేన నాయకులు. అసలు పదే పదే పవన్ ని గోక్కోవాలనుకోవడం ఏంటని ప్రశ్నించారు. అంత జిల అంబటికి ఏంటని అన్నారు.

First Published:  29 Dec 2022 2:53 AM GMT
Next Story