Telugu Global
Andhra Pradesh

వాలంటీర్లకు వకాల్తా.. టీడీపీపై అంబటి ఫైర్

వాలంటీర్లు దోపిడీ చేయడంలేదని, చంద్రబాబు కోసం తప్పుడు కథనాలు రాస్తున్న వారే దోపిడీదారులు అని అన్నారు మంత్రి అంబటి రాంబాబు.

వాలంటీర్లకు వకాల్తా.. టీడీపీపై అంబటి ఫైర్
X

ప్రతి రోజూ ఈనాడు లేదా ఆంధ్రజ్యోతిలో ప్రభుత్వ వ్యతిరేక కథనాలు రావడం, మధ్యాహ్నానికి వైసీపీ నేతలు తీవ్రంగా స్పందించడం, ఆ మరుసటి రోజు సాక్షిలో ఇదీ వాస్తవం అంటూ ఖండన కథనాలు రావడం ఇటీవల ఏపీలో సహజంగా మారిపోయాయి. గ్రామ, వార్డు వాలంటీర్లపై తాజాగా ఈనాడులో వచ్చిన కథనంపై మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా ధ్వజమెత్తారు. వాలంటీర్లపై టీడీపీ విషం చిమ్ముతోందని, వారి అనుకూల మీడియాలో తప్పుడు కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు.

వాలంటీర్లు హత్యలు, అత్యాచారాలు, మోసాలు, ఘోరాలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రజల గుమ్మం వరకు వెళ్ళి పథకాల ఫలితాలు అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థపై తప్పుడు కథనాలను టీడీపీ నేతలు రాయిస్తున్నారని అన్నారు అంబటి. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు పనికి రేటు కట్టి మరీ దోచుకున్నాయని, ఇప్పుడలాంటి పరిస్థితి లేదని అన్నారు. చంద్రబాబు హయాంలో పెన్షన్ ఎంత మందికి ఇచ్చారో, ఇప్పుడు ఎంతమందికి ఇచ్చారో ప్రజలకు తెలుసన్నారు అంబటి.

ఒకటి రెండు చోట్ల తప్పులు జరిగితే..

ఒకటి రెండు చోట్ల వాలంటీర్లు తప్పులు చేస్తే, వారిపై వెంటనే చర్యలు తీసుకుంటున్నామని వివరించారు అంబటి రాంబాబు. వాలంటీర్లు దోపిడీ చేయడంలేదని, చంద్రబాబు కోసం తప్పుడు కథనాలు రాస్తున్న వారే దోపిడీదారులు అని అన్నారు. ఇవే తనకు చివరి ఎన్నికలంటూ చంద్రబాబు మనసులో మాట బయటపెట్టారని, కానీ టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడం కల్ల అన్నారు.

దిగజారి మాట్లాడతారా..?

తనను ఆంబోతు అంటూ చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని అన్నారు మంత్రి అంబటి రాంబాబు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఇదేం ఖర్మ అంటూ టీడీపీ ఎంత ప్రచారం చేసినా తమకేమీ కాదని, 2024లో తిరిగి అధికారంలోకి వచ్చేది వైసీపీయేనన్నారు. జగన్ సంక్షేమ పథకాలు, ఆయన పాలనే తమను మరోసారి అధికారంలోకి తెస్తాయన్నారు అంబటి. సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీని తెచ్చా, ఉద్యోగాలు ఇప్పించానంటూ చంద్రబాబు ఎంత ప్రచారం చేసుకున్నా ప్రజలు నమ్మడం లేదన్నారు.

First Published:  11 Dec 2022 1:12 PM GMT
Next Story