Telugu Global
Andhra Pradesh

జగన్ నెత్తిన ఎల్లో మీడియా పాలు పోస్తోందా?

ఎల్లో మీడియా ఛానల్లో రోజు జరిగే డిబేట్లో భాగంగానే గురువారం రాత్రి యాంకర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవేమిటంటే రేపు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ ఇప్పుడు ఇస్తున్న‌ ఇళ్ళపట్టాలన్నీ రద్దయిపోతాయట.

జగన్ నెత్తిన ఎల్లో మీడియా పాలు పోస్తోందా?
X

జనాల్లో జగన్మోహన్ రెడ్డిపై వ్యతిరేకత పెంచుతున్నామని అనుకుని ఎల్లో మీడియా తప్పులో కాలేస్తోంది. అందుకనే ప్రతిరోజు ఏదో ఒక అంశాన్ని పట్టుకుని తప్పుడు వార్తలు, తప్పుడు డిబేట్లు, తప్పుడు కథనాలతో నింపేస్తోంది. కొత్తగా ఏమీ దొరక్కపోతే ఎప్పటి వార్తలనో తీసుకొచ్చి కొత్తవన్నట్లుగా అచ్చేస్తోంది, డిబేట్లు పెడుతోంది. ఇప్పుడిదంతా ఎందుకంటే ఎల్లో మీడియా ఛానల్లో రోజు జరిగే డిబేట్లో భాగంగానే గురువారం రాత్రి యాంకర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవేమిటంటే రేపు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ ఇప్పుడు ఇస్తున్న‌ ఇళ్ళపట్టాలన్నీ రద్దయిపోతాయట.

ఈరోజు ఇస్తున్న పట్టాలు కానీ, ఆర్-5 జోన్ కానీ అనంటూనే ఇది ఆర్-5 జోన్ కాదు ఆరిపోయే జోన్..ఆర్-5 జోనే అని ఎద్దేవా చేశారు. జగన్ ఇవ్వబోతున్న ఇళ్ళ పట్టాలను రేపు కొత్తప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేస్తుందని చెప్పాడంటే యాంకర్‌కు జగన్ అంటే ఎంత మంటో అర్థ‌మైపోతోంది. యాంకర్ తాజా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనికి కారణం ఏమిటంటే యాంకర్ చెప్పిన మాట చంద్రబాబు నాయుడు మనసులోని మాటే అన్నట్లుగా సోషల్ మీడియాలో చర్చ పెరిగిపోతోంది.

ఇదే విషయాన్ని రాజమండ్రి మహానాడులో పార్టీ నిర్ణయంగా చంద్రబాబు ప్రకటించగలరా? అని సందేహాలు పెరిగిపోతున్నాయి. మహానాడు ముందు ఎల్లో మీడియా యాంకర్ చేసిన ప్రకటన లేదా వార్నింగ్‌తో ఏమవుతోందంటే జగన్ కొంతకాలంగా చెబుతున్న పేదలు -పెత్తందార్ల మధ్య యుద్ధం(క్లాన్ వార్) అన్నది నిజమే అని జనాలు అనుకుంటున్నారు. యాంకర్ తాజా వార్నింగ్‌తో రాబోయే ఎన్నికల్లో అమరావతిలో ఇళ్ళ పట్టాలు అందుకోబోయే పేదలు, ఇతర ప్రాంతాల్లోని పేదలు తమ ఓట్లను వైసీపీకే వేసే అవకాశముంది.

ఎందుకంటే వైసీపీ గనుక ఓడిపోతే జగన్ ఇప్పుడు ఇస్తున్న పట్టాలు, సంక్షేమ పథకాలు రద్దయిపోతాయేమో అనే భయం పెరిగిపోతుంది. ఇళ్ళ పట్టాలు రద్దవుతాయని చెప్పినప్పుడు సంక్షేమ పథకాలను మాత్రం ఎందుకు రద్దు చేయరనే చర్చ మొదలైపోయింది. మొత్తానికి ఎల్లో మీడియా యాంకర్ ఏ ఉద్దేశంతో చెప్పాడో కానీ జగన్ నెత్తిన పాలుపోస్తున్నట్లే ఉంది.

First Published:  26 May 2023 3:30 AM GMT
Next Story