Telugu Global
Andhra Pradesh

అమరావతి బెస్ట్ ఫ్యూచరిస్టిక్ సిటీయా?

ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ప్రపంచంలోనే 6 బెస్ట్ ఫ్యూచరిస్టిక్ సిటీలుగా పేర్కొంటు ఒక మ్యాగజైన్ కథనం ప్రచురించింది. దానికి చంద్రబాబు వెంటనే హర్షం వ్యక్తం చేస్తూ బ్రహ్మాండమని, అమరావతి భవిష్యత్తులో అద్భుతమైన నగరంగా రూపుదిద్దుకోవటం ఖాయమని ట్వీట్ చేయటం విచిత్రం.

అమరావతి బెస్ట్ ఫ్యూచరిస్టిక్ సిటీయా?
X

లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు చూపించటాన్నే కనికట్టంటారు. మొదటి నుండి అమరావతి రాజధాని ఉనికి కనికట్టులాగే తయారైంది. లేని నగరాన్ని, భవిష్యత్తులో ఎప్పుడు వస్తుందో కూడా తెలియ‌ని నగరాన్ని పట్టుకుని చంద్రబాబు నాయుడు విపరీతంగా ఊదరగొట్టారు. అదికూడా అమరావతి నగరం నిర్మాణమైపోయిందన్నట్లుగా విపరీతమైన ప్రచారం చేసుకున్నారు. ఇంతాచేసి రాజధాని నిర్మాణం మొదలైందా అంటే లేదు. కేవలం గ్రాఫిక్స్ లో రాజధానిని చూపించి అమరావతి నిర్మాణం అయిపోయిందన్నట్లుగా బిల్డప్ ఇచ్చారు.

రాజధాని నగర నిర్మాణం డిజైన్లే ఫైనల్ చేయలేకపోయారు. తాత్కాలిక నిర్మాణాల పేరుతో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు భ‌వ‌నాల‌ను నాసిరకంగా నిర్మించి వేల కోట్ల రూపాయలు ఖర్చులు చేశారు. ఇపుడిదంతా ఎందుకంటే ప్రపంచంలోనే 6 బెస్ట్ ఫ్యూచరిస్టిక్ సిటీలుగా పేర్కొంటు ఒక మ్యాగజైన్ కథనం ప్రచురించింది. దానికి చంద్రబాబు వెంటనే హర్షం వ్యక్తం చేస్తూ బ్రహ్మాండమని, అమరావతి భవిష్యత్తులో అద్భుతమైన నగరంగా రూపుదిద్దుకోవటం ఖాయమని ట్వీట్ చేయటం విచిత్రం.

అంతర్జాతీయ మ్యాగజైన్ ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ పేర్కొన్న మిగిలిన ఐదు నగరాలేవో తెలీదుకానీ అమరావతిని భవిష్యత్ అద్భుత రాజధాని నగరంగా ఎలా అంచనా వేసిందో ఎవరకీ అర్థంకావటంలేదు. అమరావతి కోసం గీయించిన డిజైన్లు నాసిరకంగా ఉన్నాయి. డిజైన్ల కోసమే చంద్రబాబు ముగ్గురు ఆర్కిటెక్టులను మార్చారు. వీళ్ళకు వందల కోట్ల రూపాయల ఫీజులను చెల్లించారు. ఇవేవీ నచ్చక చివరకు సినీ దర్శకుడు రాజమౌళిని పిలిపించి బాహుబలి సినిమా సెట్టింగులకు వేసిన భవనాల్లాంటి డిజైన్లే కావాలని పట్టుబట్టారు. రాజమౌళి నవ్వేసి సినిమా సెట్టిగుల్లాంటి పర్మినెంట్ డిజైన్లు అందించటం తనవల్ల కాదని నమస్కారం పెట్టి తప్పుకున్నారు.

ప్రస్తుత రాజకీయ పరిణామాలను చూస్తుంటే అమరావతి అందరు అనుకుంటున్నట్లు కేవలం భ్రమరావతిగా మాత్రమే మిగిలిపోతుంది. అలాంటిది అంతర్జాతీయ మ్యాగజైన్ ఆర్కిటెక్చరల్ డైజెస్టు అమరావతిని బెస్ట్ ఫ్యూచరిస్టిక్ సిటీగా ఎలా పేర్కొందో అర్థంకావటంలేదు. చంద్రబాబు లాగే లేని నగరాన్ని మ్యాగజైన్ కూడా ఉన్నట్లు భ్రమపడిందా? అనే సందేహం పెరిగిపోతోంది. మ్యాగజైన్లో కథనం వచ్చిన వెంటనే చంద్రబాబు అమరావతి నగరం మనదేశానికి గర్వకారణం అంటూ తన భుజాలు తానే చరుచుకుంటూ పెద్ద ట్వీట్ పెట్టడం ఇంకా విచిత్రం.

First Published:  1 March 2023 6:12 AM GMT
Next Story