Telugu Global
Andhra Pradesh

నల్ల బెలూన్లు వర్సెస్ పచ్చ కండువాలు..

అడుగడుగునా అమరావతి రైతులు గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీలు వేస్తున్నారు. అక్కడితో ఆగకుండా జేఏసీ నేతలు.. నల్ల కండువాలు, నల్ల బెలూన్లతో యాత్రను అడ్డుకోడానికి వెళ్తున్నారు.

నల్ల బెలూన్లు వర్సెస్ పచ్చ కండువాలు..
X

జై అమరావతి అని ఇటువైపు, గో బ్యాక్ గో బ్యాక్ అంటూ అటువైపు.. తణుకులో అమరావతి యాత్ర ఉద్రిక్తంగా మారింది. పాదయాత్రగా కదలి వస్తున్న రైతుల్ని మూడు రాజధానులకు మద్దతు తెలిపేవారు అడ్డుకున్నారు. గో బ్యాక్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఓ దశలో ఘర్షణ జరిగే పరిస్థితి రావడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. పోలీసులు రక్షణ వలయంగా ఏర్పడి రైతుల్ని ముందుకు నడిపించారు. దీంతో యాత్ర ముందుకు సాగింది.

విశాఖ రాజధాని కాకూడదు అంటూ పాదయాత్ర చేస్తున్న రైతులు, ఉత్తరాంధ్రలోని అరసవెల్లి ఆలయానికి ఎలా వస్తారంటూ నిరసన కారులు ప్రశ్నిస్తున్నారు. తమ ప్రాంతంపై విషం చిమ్ముతూ తమ ప్రాంతంలోనే యాత్రలు ఎలా చేస్తారంటూ అటు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాళ్లు పెట్టనీయబోమని కొందరు, కాళ్లు విరిచేస్తామంటూ మరికొందరు వార్నింగ్ లు ఇచ్చారు. ఇలా క్రమక్రమంగా పాదయాత్ర విషయంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అటు టీడీపీ, జనసేన, బీజేపీ, ఇటు వైసీపీ కామెంట్లు కూడా యాత్రపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ దశలో తణుకులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

అడుగడుగునా ఫ్లెక్సీలు..

గతంలో అమరావతి రైతులు తిరుమల యాత్ర చేసినప్పుడు ఈ స్థాయిలో ప్రతిఘటన ఎదురు కాలేదు, ఇప్పుడు అరసవెల్లి వెళ్లే క్రమంలో మాత్రం ఉద్రిక్త వాతావరణం నెలకొంటోంది. వైసీపీ నేతలు, జేఏసీ ఆధ్వర్యంలో అడుగడుగునా అమరావతి రైతులు గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీలు వేస్తున్నారు. అక్కడితో ఆగకుండా జేఏసీ నేతలు.. నల్ల కండువాలు, నల్ల బెలూన్లతో యాత్రను అడ్డుకోడానికి వెళ్తున్నారు. దీంతో అమరావతి యాత్రలో ఉద్రిక్తత నెలకొంటోంది. పోలీసులకు ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. యాత్ర మరింత ముందుకు వెళ్తే పరిస్థితి ఇంకాస్త దారుణంగా మారే అవకాశముంది.

First Published:  12 Oct 2022 2:17 PM GMT
Next Story