Telugu Global
Andhra Pradesh

తప్పు అల్లు అర్జున్‌దా?.. పవన్ ఫ్యాన్స్‌దా?

అసలు అల్లు అర్జున్‌కు, మెగా ఫ్యామిలీకి ఎక్కడ చెడింది?. పవన్ కల్యాణ్‌ ఫ్యాన్స్‌కు, అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు మధ్య గొడవ ఎక్కడ మొదలైందో ఇప్పుడు తెలుసుకుందాం.

తప్పు అల్లు అర్జున్‌దా?.. పవన్ ఫ్యాన్స్‌దా?
X

మెగా వర్సెస్ అల్లు వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఏపీ ఎన్నికల వేళ అల్లు అర్జున్ వ్యవహరంపై మెగా అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. అల్లు అర్జున్, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు. అగ్నికి ఆజ్యం పోసినట్లు.. అభిమానుల వార్‌కు నాగబాబు ట్వీట్ తోడైంది. దీంతో సోషల్‌ మీడియాలో అల్లు వర్సెస్ మెగా వార్ పీక్స్‌కు చేరింది .

నాగబాబు ట్వీట్‌తో..

"మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే.." అంటూ నాగబాబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. అల్లు అర్జున్‌ను ఉద్దేశించే నాగబాబు ఈ ట్వీట్ వేశారంటూ అల్లు ఆర్మీ మెగాఫ్యామిలీపై విరుచుకుపడుతోంది. అటు మెగా ఫ్యాన్స్‌ సైతం పుష్పరాజ్ ఫ్యాన్స్‌కు కౌంటర్‌ ఇస్తున్నారు. ఇలా మరోసారి మెగాఫ్యామిలీలో వివాదం చెలరేగింది.

గొడవ ఎక్కడ మొదలైంది..?

అసలు అల్లు అర్జున్‌కు, మెగా ఫ్యామిలీకి ఎక్కడ చెడింది?. పవన్ కల్యాణ్‌ ఫ్యాన్స్‌కు, అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు మధ్య గొడవ ఎక్కడ మొదలైందో ఇప్పుడు తెలుసుకుందాం. అది 2017 జూలై. సరైనోడు సక్సెస్ మీట్. అల్లు అర్జున్ మాట్లాడుతుండగా.. పవన్ కల్యాణ్ అభిమానులు పవర్ స్టార్ గురించి చెప్పమని అరుస్తారు. అల్లు అర్జున్ చెప్పను బ్రదర్ అంటాడు. అంతే ఆ మాటతో.. అల్లు అర్జున్‌పై పవన్ ఫ్యాన్స్‌ కోపం పెంచుకున్నారు.

డీజే టీజర్‌కు డిస్‌లైకుల వర్షం..

సరైనోడు బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత అల్లు అర్జున్ డీజే.. దువ్వాడ జగన్నాథం సినిమా చేశాడు. అప్పటికే గుర్రుమీదున్న పవన్ ఫ్యాన్స్‌.. డీజే టీజర్‌పై తమ ప్రతాపం చూపించారు. ఆ దెబ్బకు ఇప్పటికీ ఇండియాలోనే మోస్ట్‌ డిస్‌లైక్‌డ్‌ టీజర్‌గా డీజే మిగిలిపోయింది. వివాదం సద్దుమనగక పోవడంతో అల్లు అర్జున్ దానిపై స్పందించాడు. ప్రతిసారి మీరు పవర్ స్టార్ అని అరవడం వల్ల ఇబ్బంది అవుతోందని.. మెగా ఫ్యామిలీకి సంబంధం లేని ఈవెంట్లలోనూ మీరు పవర్ స్టార్ అని అరవడం వల్ల మిగతా హీరోలు హర్ట్ అవుతున్నారని చెప్పుకొచ్చాడు. దీనికి ఫుల్‌ స్టాప్‌ పెట్టాలనే ఆరోజు చెప్పను బ్రదర్ అన్నానని క్లారిటీ ఇచ్చాడు. మేంమేం బాగానే ఉంటాం. మీ ఫ్యాన్సే అనవసరంగా కొట్టుకుంటారు. దయచేసి ఇలా సోషల్‌ మీడియాలో గొడవలు పడుతూ.. మీస్థాయిని తగ్గించుకొని, మాస్థాయిని తగ్గించొద్దని రిక్వెస్ట్ చేశాడు.

పిఠాపురం చిచ్చు..

వివాదంపై అల్లు అర్జున్‌ క్లారిటీ ఇచ్చినా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, అల్లు ఆర్మీ మధ్య వార్ జరుగుతూనే ఉంది. కానీ, ఏపీ ఎన్నికలవేళ అది మరింత ఎక్కువైంది. ఈ ఎన్నికల్లో అల్లు అర్జున్ ఒక వైపు.. మెగా కుటుంబం మరోవైపు అన్నట్లు పరిస్థితి మారింది. తన ఫ్రెండ్‌, నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవి కోసం అల్లు అర్జున్ రంగంలోకి దిగాడు. మిత్రుడి కోసం నంద్యాలకు వచ్చి మరీ ప్రచారం చేశాడు. మరోవైపు పిఠాపురం నుంచి మేనమామ పవన్ కల్యాణ్ బరిలో ఉన్నా.. అల్లు అర్జున్ ప్రచారానికి వెళ్లలేదు. ఓ ట్వీట్ పెట్టి వదిలేశాడు. అదే సమయంలో రామ్ చరణ్, తన తల్లి సురేఖతో కలిసి చివరిరోజు పిఠాపురంలో ప్రచారం చేశాడు. మెగా కాంపౌండ్‌లోని హీరోలంతా పవన్ కల్యాణ్ కోసం పిఠాపురంలో ప్రచారం చేశారు. కానీ, అందరికీ భిన్నంగా అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి కోసం ప్రచారం చేయడాన్ని మెగా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.

వివాదానికి ఫుల్‌స్టాప్‌ ఎప్పుడు..?

తనకు ఏ పార్టీతో సంబంధం లేదని అల్లు అర్జున్ వివరణ ఇచ్చినప్పటికీ పవన్ ఫ్యాన్స్ తగ్గట్లేదు. తాజాగా నాగబాబు ట్వీట్‌తో వైరం మరింత పెరిగినట్లయింది. చూడాలి మరి మెగా వర్సెస్ అల్లు యుద్ధం ఎక్కడి వరకు చేరుతుందో?. ఆపడానికి నేరుగా చిరంజీవే రంగంలోకి దిగుతారా లేక పవన్ కల్యాణ్‌ చూసుకుంటారా? అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఏదేమైనా మెగా ఫ్యామిలీలో ఏదో జరుగుతోంది అన్న అనుమానాలకు తాజా వివాదం మరింత బలాన్ని చేకూర్చింది.

First Published:  14 May 2024 11:20 AM GMT
Next Story