Telugu Global
Andhra Pradesh

అక్కడ అన్ని పార్టీలు బీజేపీకే మద్దతు...ప్రత్యేకంగా ప్రకటనలెందుకు ?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ బీజేపీ కరుణా కటాక్షాల కోసం ఎదురుచూస్తున్నాయి. అందులో భాగమే ఏన్డీఏ లో చేరాలన్న చంద్రబాబు ఆశ కూడా.

అక్కడ అన్ని పార్టీలు బీజేపీకే మద్దతు...ప్రత్యేకంగా ప్రకటనలెందుకు ?
X

తెలుగుదేశం పార్టీ త్వరలో ఎన్డీఏ లో చేరబోతుందని చంద్రబాబు అనుకూల మీడియా కొంత కాలంగా ప్రచారం చేస్తోంది. గత ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో జతకట్టి బొక్క బోర్లా పడ్డ చంద్రబాబు మీద‌ బీజేపీ నాయకులకు నమ్మకం లేక పోయినా రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చనే ఒకే ఒక సూత్రం ఆధారంగా టీడీపీ, బీజేపీల పొత్తు వార్తలకు రెక్కలు తొడుగుతున్నాయి.

అయితే ప్రస్తుతానికైతే అటువంటి అవ‌శాలున్నట్టు కనిపించడం లేదన్నది బీజేపీ నాయకుల వాదన. చంద్రబాబుతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని, తెలంగాణలో ఒంటరిగా, ఆంధ్రప్రదేశ్ లో జనసేన తో కలిసి పోటీ చేస్తామని ఆ పార్టీ రాజ్య సభ సభ్యుడు డాక్టర్ కే. లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఇదే విషయంపై చంద్రబాబును మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు అవుననకుండా, కాదనకుండా జవాబు చెప్పారు. ఎవరు ప్రచారం చేస్తున్నారో వాళ్ళనే అడగండి అని చెప్పిన ఆయన తానుమాత్రం దీనిపై ఇప్పుడు స్పందించబోనన్నారు.

చంద్రబాబు ఇలా మాట్లాడటంలో అర్దమేంటి ? అందరినీ సందిగ్దంలో పడేసి సమయం గడపాలనే ఆయన వ్యూహమా ? అసలు చంద్రబాబుతో పొత్తే లేదని బీజేపీ నాయకులు చెప్తుంటే బాబు మాత్రం తాను స్పందించబోననడం దేనికి నిదర్శనం ? నిజానికి చంద్రబాబుకు ఇప్పుడు బీజేపీ అవసరం ఉంది. అందుకే బీజేపీతో పొత్తు కోసం తహతహలాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ తో కూడా రెకమెండేషన్ చేయిస్తున్నాడు. తన అనుకూల మీడియాలో ప్రచారం సాగుతోంది. ఇంత జరిగినా బీజేపీ నేతలు పట్టించుకోకపోవడం చంద్రబాబుకు మింగుడుపడటం లేదు. ఆ విషయం బైటకు చెప్పుకోలేక 'ఆకుకు అందక పోకకు పొందక' అన్నరీతిలో మాట్లాడుతున్నాడు.

నిజానికి ఆంధ్రప్రదేశ్ లో విచిత్ర‌మైన పరిస్థితి నెలకొంది. ఏపీలో 5 శాతం ఓట్లు కూడా లేని బీజేపీ కరుణా కటాక్షాల కోసం అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేనలు సాగిలపడటం... బీజేపీ ఎవ్వరినీ లెక్కచేయనట్టు నటించడం.... రాజకీయాల్లో డొల్లతనానికి ప్రతీక‌

First Published:  1 Sep 2022 12:20 PM GMT
Next Story