Telugu Global
Andhra Pradesh

నాకు, పవన్‌ కల్యాణ్‌ మధ్య గ్యాప్ లేదు.. క్రియేట్ చేశారు : అలీ

అలీ, పవన్ బయట కలుసుకున్నట్లు ఏనాడూ వార్తలు రాలేదు. దీంతో సుమ.. మీ ఇద్దరికీ ఏమైనా గ్యాప్ వచ్చిందా అని ప్రశ్నించారు.

నాకు, పవన్‌ కల్యాణ్‌ మధ్య గ్యాప్ లేదు.. క్రియేట్ చేశారు : అలీ
X

సినీ నటుడు, ప్రముఖ కమేడియన్ అలీ.. ఈటీవీలో చాన్నాళ్ల నుంచి ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 'అలీతో సరదాగా' అనే పేరుతో ప్రతీ సోమవారం రాత్రి ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమంలో ఎంతో మంది సినీ రంగ ప్రముఖులను ఇంటర్యూ చేశారు. ఇప్పటి జనరేషన్ నటులనే కాకుండా, గతంలో సినీ రంగాన్ని ఏలిన నటులు, దర్శకులు, నిర్మాతలను కూడా ఈ వేదికగా పరిచయం చేశారు. ఒక రకంగా కనుమరుగు అయిన ఎంతో మంది నటులను తిరిగి తెరపై చూపించిన ఘనత అలీకే దక్కుతుంది. అయితే.. అలీ ఈ షోను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

'అలీతో సరదాగ' ప్రోగ్రామ్‌కు సంబంధించిన చివరి ఎపిసోడ్ ప్రోమోను ఈటీవీ విడుదల చేసింది. ఈ సారి సెలెబ్రిటీలు ఎవరూ లేరు. ఎందుకంటే చివరి ఎపిసోడ్‌లో అలీని మరో యాంకర్ ఇంటర్వ్యూ చేశారు. ఫీమేల్ యాంకర్ అనగానే గుర్తుకు వచ్చే సుమ.. ఈ ఎపిసోడ్‌లో అలీని అనేక ప్రశ్నలు అడిగారు. ప్రోమోలోనే అదిరిపోయే క్వశ్చన్స్ ఉండటంతో ప్రేక్షకులకు ఆసక్తి పెరిగిపోయింది. అలీ కుటుంబం, సినిమా ప్రయాణంతో మొదలైన ప్రశ్నల పరంపర.. పవన్ కల్యాణ్ వద్దకు వచ్చింది.

సినీ ఇండస్ట్రీలోనే కాకుండా ప్రేక్షకులకు కూడా అలీ, పవన్ మధ్య ఉన్న స్నేహం తెలుసు. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టి ఏపీ రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. అదే సమయంలో వైసీపీకి అలీ దగ్గరయ్యారు. ఆ పార్టీ తరపున ప్రచారం చేయడమే కాకుండా.. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వైఎస్ జగన్‌తో సన్నిహితంగా ఉంటున్నారు. తాజాగా అలీకి ఏపీ ప్రభుత్వంలో కీలక పదవి కూడా లభించింది. మరో వైపు అలీ, పవన్ బయట కలుసుకున్నట్లు ఏనాడూ వార్తలు రాలేదు. దీంతో సుమ.. మీ ఇద్దరికీ ఏమైనా గ్యాప్ వచ్చిందా అని ప్రశ్నించారు.

సుమ అడిగిన ప్రశ్నకు అలీ కూడా సినిమాటిక్‌గా సమాధానం చెప్పారు. పవన్ కల్యాణ్‌తో గ్యాప్ రాలేదని.. క్రియేట్ చేశారని చెప్పుకొచ్చారు. అయితే గ్యాప్ క్రియేట్ చేసింది ఎవరో మాత్రం ప్రోమోలో చెప్పలేదు. ఆ వివరాలు కావాలంటే ఎపిసోడ్‌ను పూర్తిగా చూడాల్సి ఉంటుంది. ఇక 'అలీతో సరదాగా' కార్యక్రమాన్ని తాను మంచు లక్ష్మితో ప్రారంభించానని.. అందుకే ఈ విజయానికి ఆమె కూడా కారణమని అలీ చెప్పారు. మంచు లక్ష్మికి నేను తప్పకుండా థ్యాంక్స్ చెప్పాలని ఆయన అన్నారు. ప్రస్తుతానికి బ్రేక్ తీసుకున్నా.. త్వరలోనే మరింత అద్బుతమైన షోతో ప్రేక్షకుల ముందుకు వస్తానని ఆయన అన్నారు. ఇదే షోలో.. అలీ తన పెళ్లికి ముందు ఉన్న లవ్ ట్రాక్ గురించి కూడా చెప్పుకొచ్చారు.

యాంకర్ సుమ షో ప్రారంభానికి ముందే శాలువాతో అలీని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో సుమ ఈక్వల్ టూ ప్లాంతర్ ఫగిడీ అంటూ తనదైన శైలిలో నవ్వులు పూయించారు. ప్లాంతర్ ఫగిడి అంటే ఫ్లవర్ అని అర్థమని అలీ స్పష్టం చేశారు. మొత్తానికి అలీ చివరి ఎపిసోడ్ నవ్వులతో పాటు అనేక ప్రశ్నలకు జవాబులు కూడా ఇవ్వబోతున్నట్లు తెలుస్తున్నది.

First Published:  15 Dec 2022 10:30 AM GMT
Next Story