Telugu Global
Andhra Pradesh

ఫాతిమా నగర్ గా మారిన అగ్రహారం..

గుంటూరు నగరంలో మున్సిపల్ అధికారులు ఓ వార్డ్ లోని రెండు లైన్లకు పేరు మార్చడం చర్చనీయాంశమైంది. ఆ పేరు మార్పు వ్యవహారం మతపరమైన విద్వేషాలకు కారణం కావడం విశేషం.

ఫాతిమా నగర్ గా మారిన అగ్రహారం..
X

మత మార్పిడులు, లవ్ జీహాద్ అనే అంశాలు దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమవుతున్నాయి. ఇలాంటి వ్యవహారాలపై తీసిన 'ది కేరళ స్టోరీ' లాంటి సినిమాల సంగతి కూడా తెలిసిందే. ఇంత జరుగుతున్నా.. తెలిసో తెలియకో లేనిపోని గొడవలకు కారణం అవుతున్నారు కొంతమంది ప్రభుత్వ అధికారులు. తాజాగా గుంటూరులో ఏటీ అగ్రహారం అనే ప్రాంతం పేరుని ఫాతిమా నగర్ గా మార్చేయడంతో అసలు గొడవ మొదలైంది. పేరు మార్పుపై గుంటూరు కార్పొరేషన్లో తీర్మానం చేశారని అంటున్నారు. అసలు ఆ పేరు మార్చాలని తీర్మానం చేయడమేంటి..? అగ్రహారం అనే పేరుని ఎందుకు వద్దనుకున్నారో చెప్పాలని స్థానికుల్లో కొందరు డిమాండ్ చేస్తున్నారు.

గుంటూరు నగరంలో మున్సిపల్ అధికారులు ఓ వార్డ్ లోని రెండు లైన్లకు పేరు మార్చడం చర్చనీయాంశమైంది. ఆ పేరు మార్పు వ్యవహారం మతపరమైన విద్వేషాలకు కారణం కావడం విశేషం. ఆనంద త్రిదండి(ఏటీ) అగ్రహారం అనే ప్రాంతం గుంటూరులో బాగా ఫేమస్. ఆ పేరుని ఇప్పుడు ఫాతిమా నగర్ గా మార్చి కార్పొరేషన్ సిబ్బంది బోర్డ్ లు పెట్టారు. దీనిపై స్థానికుల్లో కొంతమంది అభ్యంతరం తెలిపారు. అయినా కూడా సిబ్బంది ఆ బోర్డులు మార్చలేదు. కొంతమంది యువకులు ఈ బోర్డులను తొలగించే ప్రయత్నం చేశారు. ఫాతిమా నగర్ అనే స్టిక్కర్ ని చించివేసి, ఏటీ అగ్రహారం అంటూ అదే బోర్డ్ పై రాశారు. ఈ పేరు మార్పు ఇప్పుడు సంచలనంగా మారింది.


మధ్యలో మతం రంగు..

బీజేపీ దీనికి మతం రంగు పూసింది. హిందువుల మనోభావాలను దెబ్బ తీయడమే వైసీపీ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని ఆరోపించారు ఏపీ బీజేపీ అద్యక్షుడు సోము వీర్రాజు. గుంటూరులో అగ్రహారం పేరుని రాత్రికి రాత్రే మార్చేసి.. ఫాతిమా నగర్ అనే బోర్డ్ పెట్టడంలో ప్రభుత్వ ఉద్దేశమేంటని ప్రశ్నించారు. విశాఖ నగరంలో సీతమ్మ కొండ పేరు కూడా మార్చేశారని, ప్రొద్దుటూరు లో టిప్పుసుల్తాన్ విగ్రహం పెట్టే ప్రయత్నం చేశారని.. ఈ వ్యవహారాలకు సూత్రధారులెవరని ప్రశ్నించారు. అసలు ముస్లింల కోసం ఎందుకు చట్టాలు మారుస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల పై దాడులకు తెగబడే విధంగా వైసీపీ వ్యవహరిస్తోందన్నారు.

First Published:  4 May 2023 7:35 AM GMT
Next Story