Telugu Global
Andhra Pradesh

మీడియాని హడావిడి పెట్టిన మోహన్ బాబు..

ఏపీ రాజకీయాల్లో ఇదో సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా..? మోహన్ బాబు టీడీపీలో చేరిపోయారా..? ఇలా రకరకాల బ్రేకింగ్ ప్లేట్లు, సవాలక్ష ఫోన్ ఇన్ లు, వివరణలు, విశ్లేషణలు.

మీడియాని హడావిడి పెట్టిన మోహన్ బాబు..
X

ఉన్నట్టుండి మోహన్ బాబు, టీడీపీ నేత చంద్రబాబు ఇంటికెళ్లారు. ఆయన్ను కలిసి కాసేపు ముచ్చటించారు. ఇంకేముందు మీడియాకి విందు భోజనం దొరికింది. అసలు ఈ బాబు, ఆ బాబు ఇంటికెందుకెళ్లారు..? చాన్నాళ్లుగా చంద్రబాబు పేరు చెబితేనే చిటపటలాడిన మోహన్ బాబు సడన్ గా ఎందుకు మనసు మార్చుకున్నారు..? ఏపీ రాజకీయాల్లో ఇదో సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా..? మోహన్ బాబు టీడీపీలో చేరిపోయారా..? ఇలా రకరకాల బ్రేకింగ్ ప్లేట్లు, సవాలక్ష ఫోన్ ఇన్ లు, వివరణలు, విశ్లేషణలు. కానీ చివరికి మోహన్ బాబు అసలు సంగతి చెప్పేశారు. చేతిలో చెయ్యి వేసినా తాను ఆయన చేతిలో పెట్టింది ఓ ఆహ్వాన పత్రిక అని తేల్చి చెప్పారు. తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ సమీపంలో నిర్మించిన‌ సాయిబాబా గుడి విగ్రహ ప్రతిష్ఠాపన, ఆగస్టు లో జరగాల్సి ఉందని, ఆ కార్యక్రమానికి చంద్రబాబును ఆహ్వానించడానికి మాత్రమే కలిశానంటూ క్లారిటీ ఇచ్చారు. తమ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాముఖ్యత లేదన్నారు మోహన్ బాబు.

లేదు లేదంటే నమ్మేయాల్సిందేనా..?

రాజకీయ ప్రాధాన్యత లేదని మోహన్ బాబు చెబుతున్నా.. ఇద్దరి మధ్యా సుదీర్ఘంగా 2 గంటలసేపు చర్చలు జరిగినట్టు సమాచారం. అందులోనూ ఇటీవల మోహన్ బాబు, చంద్రబాబు మధ్య చాలా గ్యాప్ వచ్చింది. ఆమధ్య మోదీ జట్టులో ఉన్నామని చెప్పిన మంచు కుటుంబం, సడన్ గా గత ఎన్నికల ముందు జగన్ దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత శ్రీ విద్యానికేతన్ ఫీజు రీయింబర్స్ మెంట్ ల వ్యవహారంలో ఓసారి రోడ్డెక్కి మోహన్ బాబు నిరసన తెలిపారు. ఇటీవల సినీ ఇండస్ట్రీ సీఎం జగన్ ని కలసిన సందర్భంలో తమ ప్రమేయం లేదని, తమ కుటుంబానికి ఆహ్వానం లేదని మథనపడ్డారు. ఆ రెండు విషయాలతో మోహన్ బాబు, జగన్ పై కాస్త గుర్రుగా ఉన్నారని సమాచారం. ఇప్పుడు చంద్రబాబు భేటీతో అది మరోసారి హైలైట్ అయింది.

అన్ని తిట్లు తిట్టి చివర్లో సాయిరాం..

తిట్టుకోవడం, కలసిపోవడం, చిరునవ్వులు చిందించడం రాజకీయాల్లో కామన్. సినిమా ఇండస్ట్రీలో కూడా అది సహజమేనని ఇప్పటికే చిరంజీవి, మోహన్ బాబు నిరూపించారు. గతంలో మోహన్ బాబు, చంద్రబాబుని కూడా బాగానే తిట్టారు. నీఛుడు, నికృష్టుడు, నమ్మకద్రోహి, తన రాజకీయ జీవితాన్ని నాశనం చేశారని, అవకాశ వాది అని, వాడుకుని వదిలేస్తారంటూ.. చాలా చాలా మాటలన్నారు. అయితే అనుకోకుండా ఇలా ఆయన ఇంటికి వచ్చి అందరికీ షాకిచ్చారు. ఈ భేటీ వెనక బాలకృష్ణ మంత్రాంగం ఉందనే వార్తల్లో ఎంతవరకు నిజముందో ముందు ముందు తేలాల్సి ఉంది.

First Published:  27 July 2022 2:05 AM GMT
Next Story