Telugu Global
Andhra Pradesh

షిర్డీ ఆలయంపై మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు..

తాను కట్టించిన సాయిబాబా గుడి అద్భుతంగా ఉందని, ఇకపై సాయి భక్తులు షిర్డీ వరకు వెళ్లాల్సిన పనిలేదన్నట్టు మాట్లాడారు మోహన్ బాబు. దీంతో అనుకోకుండా ఆయన విమర్శలు కొని తెచ్చుకున్నారు, నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు.

షిర్డీ ఆలయంపై మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు..
X

దేవుడి ఆలయాలు చాలా చోట్ల ఉంటాయి. ఒకే దేవుడికి పలుచోట్ల ఆలయాలు కట్టి పూజిస్తుంటారు భక్తులు. తిరుమల శ్రీవారి ఆలయానికి వెళ్లినంత మాత్రాన, స్థానికంగా ఉండే వేంకటేశ్వరుడి ఆలయానికి వెళ్లక్కర్లేదు అనుకుంటే ఎలా. ఏ గుడి ప్రాధాన్యం ఆ గుడిది, ఏ క్షేత్ర మహత్యం ఆ క్షేత్రానిది. కానీ, తమను తాము పొగుడుకునే క్రమంలో సినీ నటుడు మోహన్ బాబు నోరు జారడం ఇప్పుడు సాయిబాబా భక్తుల మనసుల్ని గాయపరిచింది. తాను కట్టించిన సాయిబాబా గుడి అద్భుతంగా ఉందని, ఇకపై సాయి భక్తులు షిర్డీ వరకు వెళ్లాల్సిన పనిలేదన్నట్టు మాట్లాడారు మోహన్ బాబు. దీంతో అనుకోకుండా ఆయన విమర్శలు కొని తెచ్చుకున్నారు, నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు.

భక్తుడే, కానీ..

మోహన్ బాబు, సాయిబాబా భక్తుడని అందరికీ తెలుసు. సాయి మహిమల గురించి, తన జీవితంలో సాయి లీలల గురించి కూడా ఆయన చాలా సందర్భాల్లో బహిరంగ వేదికలపై చెప్పుకున్నారు. ఆ భక్తితోనే ఆయన.. చంద్ర‌గిరి మండ‌లం రంగంపేట‌లో సాయిబాబా గుడి నిర్మించారు. ఇటీవల ఈ గుడి ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకు చంద్రబాబుని కలిసి కలకలం రేపారు మోహన్ బాబు. ఇప్పుడా గుడి ప్రారంభోత్సవంలో మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు మరింత కలకలంగా మారాయి. ద‌క్షిణాదిలోనే అతి పెద్ద‌దైన సాయి బాబా గుడిని నిర్మించామని చెబుతున్న మోహన్ బాబు.. ఇదో అద్భుతం అని కీర్తించారు. అక్కడితో ఆగితే బాగుండేది, కానీ అంతకు మించి గొప్పగా చెప్పాలనేది ఆయన తాపత్రయం. అందులో భాగంగా.. తన దృష్టిలో ఇక భ‌క్తులు షిర్డీ సాయినాథుని ఆల‌యానికి వెళ్ల‌క్క‌ర్లేదు అని వ్యాఖ్యానించారు. షిర్డీ ఆలయంపై మోహన్‌బాబు చేసిన కామెంట్లు భక్తుల మనోభావాలు దెబ్బతీశాయి. వారు సోషల్ మీడియాలో తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఈ గుడి నిర్మాణ సమయంలో రుషికేష్ నుంచి 110 సంవత్సరాల వయసు పైబడిన సాధువులు వచ్చారని, వారు తీసుకొచ్చిన అమూల్యమైన మూలికలు ఆలయంలో పెట్టామని చెప్పుకొచ్చారు మోహన్ బాబు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లొచ్చే భక్తులంతా తమ ఆలయానికి రావాలన్నట్టుగా తన కుమారుడు విష్ణు సూచన మేరకు ఇంత భారీ ఆలయాన్ని నిర్మించామని చెబుతున్నారు మోహన్ బాబు. గొప్పలు చెప్పే క్రమంలో ఆయన షిర్డీ గురించి చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు తిప్పలు కొనితెచ్చాయి. మోహన్ బాబు గుడికి వచ్చినంత మాత్రాన షిర్డీ వెళ్లాల్సిన అవసరం లేదంటే ఎలా అంటున్నారు భక్తులు. మోహన్ బాబు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. డబ్బులుండి పెద్ద పెద్ద పాలరాతి బండలతో గుడి కట్టి, పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టినంత మాత్రాన షిర్డీ ఆలయాన్ని తక్కువచేసి మాట్లాడటం సరికాదని అంటున్నారు.

First Published:  10 Aug 2022 9:59 AM GMT
Next Story