Telugu Global
Andhra Pradesh

పార్టీ గురించి అచ్చెన్న చెప్పింది నిజమేనా?

అప్పుడెప్పుడో అచ్చెన్నాయుడు మాట్లాడిన పార్టీ లేదు బొక్కా లేదన్న డైలాగుకు ఇప్పుడు చంద్రబాబు మాట్లాడిన మాటలు సరిగ్గా సరిపోయాయి. దీన్నిపట్టుకుని వైసీపీ సోషల్ మీడియా ఓ రేంజిలో రెచ్చిపోతోంది.

పార్టీ గురించి అచ్చెన్న చెప్పింది నిజమేనా?
X

అప్పుడెప్పుడో రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు గురించి ఒక మాటన్నారు గుర్తుందా ? తిరుపతి పార్లమెంటు ఉపఎన్నిక సందర్భంగా భవిష్యత్తు గురించి అచ్చెన్న మాట్లాడుతు 'పార్టీ లేదు బొక్కా లేదు' అన్నారు. అప్పట్లో అచ్చెన్న ఏ ఉద్దేశంతో అన్నారో తెలీదుకానీ ఆ మాటలు నిజమే అన్నట్లుగా ఉంది. పార్టీ నేతలతో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. పార్టీ నిర్వీర్యమైపోతోందని మండిపోయారు.

ఒక వైపు పార్టీ నిర్వీర్యమైపోతుంటే నేతలంతా పోరాడకుండా, చెప్పిన మాటలు వినకుండా మళ్ళీ ఇక్కడకు అంటే పార్టీ ఆఫీసుకు వచ్చి బలప్రదర్శన చేస్తారా? అంటూ చంద్రబాబు నిష్టూరంగా మాట్లాడారు. పార్టీ నేతలతో చంద్రబాబు మాట్లాడిన వీడియో బయటకు ఎలాగ వచ్చిందో అర్ధం కావటం లేదు. 12 సెకండ్ల నిడివి కలిగిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సమావేశంలో చంద్రబాబు ఎంతసేపు నేతలతో మాట్లాడారు? ఏ విషయాలపై క్లాసులు పీకారో తెలీదుకానీ ఈ 12 సెకండ్ల బిట్ మాత్రం సంచలనంగా మారింది.

అప్పుడెప్పుడో అచ్చెన్నాయుడు మాట్లాడిన పార్టీ లేదు బొక్కా లేదన్న డైలాగుకు ఇప్పుడు చంద్రబాబు మాట్లాడిన మాటలు సరిగ్గా సరిపోయాయి. దీన్నిపట్టుకుని వైసీపీ సోషల్ మీడియా ఓ రేంజిలో రెచ్చిపోతోంది. తాజాగా చంద్రబాబు మాట్లాడిన వీడియో బిట్‌కు అప్పుడెప్పుడో అచ్చెన్న డైలాగుల‌ వీడియోను జతచేసి మరీ వైరల్ చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు మాటల్లోనే క్షేత్రస్ధాయిలో పార్టీ పరిస్ధితి ఏమిటనేది అందరికీ కళ్ళకు కట్టినట్లయ్యింది.

నెలల తరబడి బాదుడే బాదుడనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇపుడేమో ఇదేం ఖర్మ..రాష్ట్రానికి అనే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కర్నూలు, గుంటూరు, చిత్తూరు, విజయనగరం, ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించారు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా అధికారంలోకి రాబోయేది టీడీపీయే అని ఊదరగొడుతున్నారు. మరి నేతల సమీక్షలో చేసిన వ్యాఖ్యలు దేన్ని సూచిస్తున్నాయి? చంద్రబాబు మనసులోని మాటలనే సూచిస్తున్నట్లు అర్ధమైపోతోంది. మరి ఈ డ్యామేజీని చంద్రబాబు ఎలా కంట్రోల్ చేస్తారో చూడాలి.

First Published:  14 Dec 2022 5:17 AM GMT
Next Story