Telugu Global
Andhra Pradesh

లింగమనేని గెస్ట్ హౌస్ జప్తుకి ఏసీబీ కోర్టు అనుమతి

విచారణ చేపట్టిన ఏసీబీ న్యాయస్థానం.. ఇరుపక్షాల వాదనలు విని ఈరోజు తుది తీర్పు వెలువరించింది. గెస్ట్‌ హౌస్‌ జప్తుకి సీఐడీ అధికారులకు అనుమతి ఇచ్చింది.

లింగమనేని గెస్ట్ హౌస్ జప్తుకి ఏసీబీ కోర్టు అనుమతి
X

లింగమనేని గెస్ట్ హౌస్ జప్తుకి ఏసీబీ కోర్టు అనుమతి

కృష్ణానది కరకట్టపై ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్ జప్తు చేసేందుకు సీఐడీకి అనుమతి ఇస్తూ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. ముందుగా లింగమనేని రమేష్ కి నోటీసు ఇవ్వాలని సూచించింది. ఆ తర్వాత జప్తు చేయొచ్చని తెలిపింది. మాజీ మంత్రి నారాయణ ఆస్తులను పాక్షికంగా జప్తు చేయడానికి కూడా కోర్టు సీఐడీకి అనుమతి ఇచ్చింది.

ఉండవల్లి కరకట్ట వద్ద ఉన్న లింగమనేని రమేష్ గెస్ట్‌ హౌస్‌ ను అటాచ్‌ చేయాలంటూ ప్రభుత్వం ఇటీవల జీవో విడుదల చేసింది. జప్తు చేసేందుకు అనుమతి కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఇరుపక్షాల వాదనలు విని ఈరోజు తుది తీర్పు వెలువరించింది. గెస్ట్‌ హౌస్‌ జప్తుకి సీఐడీ అధికారులకు అనుమతి ఇచ్చింది.

లింగమనేని గెస్ట్ హౌస్ వ్యవహారంలో గత ప్రభుత్వానికి ఆయనకు మధ్య క్విడ్ ప్రోకో జరిగిందనేది ప్రధాన ఆరోపణ. ఆ గెస్ట్ హౌస్ కోసం చంద్రబాబు తన హయాంలో సీఆర్డీఏ మాస్టర్‌ ప్లాన్‌, అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌ మెంట్లలో అవకతవకలకు పాల్పడ్డారని వైసీపీ నేతలు ఆరోపించేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కరకట్ట గెస్ట్ హౌస్ వ్యవహారం తేల్చాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ ప్రభుత్వం సీఐడీతో ఎంక్వయిరీ మొదలు పెట్టింది. సీఐడీ విచారణలో క్విడ్ ప్రోకో జరిగినట్టు గుర్తించింది. దీంతో ప్రభుత్వం తాజాగా ఆ గెస్ట్ హౌస్ ని అటాచ్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఆ ఉత్తర్వులను అమలు చేసేలా ఏసీబీ కోర్టు అనుమతి కోరింది సీఐడీ. వాదనలు విన్న ఏసీబీ న్యాయస్థానం జప్తుకి అనుమతి ఇచ్చింది. దీంతో చంద్రబాబుకి భారీ షాక్ తగిలినట్టయింది.

First Published:  30 Jun 2023 3:16 PM GMT
Next Story