Telugu Global
Andhra Pradesh

కోరలు లేవని విషనాగును మెడలో వేసుకున్నాడు.. ఆపై..

తాను పాముతో చెలగాటమాడిన విషయం తన తల్లిదండ్రులకు తెలిస్తే తిడుతారన్న భయంతో ఫొటోలను, వీడియోలను మణికంఠ తన ఫోన్ నుంచి అంతకుముందే తొలగించాడు.

కోరలు లేవని విషనాగును మెడలో వేసుకున్నాడు.. ఆపై..
X

నాగుపాముతో సరదా ఒక యువకుడి ప్రాణాలు తీసింది. పాములు ఆడించే వ్యక్తి చెప్పిన మాటలు నమ్మేసి నాగుపామును మెడలో వేసుకుని సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించి యువకుడు మణికంఠ రెడ్డి మృత్యువాత పడ్డారు. నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో ఈ ఘటన జరిగింది. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడు గ్రామానికి చెందిన సాయి మణికంఠ రెడ్డి అనే 22 ఏళ్ల యువకుడు కందుకూరులో లస్సీ దుకాణం నిర్వహిస్తున్నాడు.

మంగళవారం రాత్రి వెంకటస్వామి అనే పాములు ఆడించే వ్యక్తి వచ్చాడు. ఆ పామును చూసిన మణికంఠ రెడ్డి సరదాగా సెల్ఫీ దిగాలనుకున్నాడు. వెంకటస్వామి కూడా అందుకు ప్రోత్సహించాడు. తాను నాగుపాముకు కోరలు తీసేశానని, ధైర్యంగా ఆ పామును మెడలో వేసుకోవచ్చని చెప్పాడు. దాంతో మణికంఠ రెడ్డి తన సెల్ ఫోను స్నేహితుడికి ఇచ్చి ఫొటోలు, వీడియో తీయాల్సిందిగా చెప్పి.. నాగుపామును మెడలో వేసుకుని ఫోజులు ఇవ్వబోయాడు. ఆ సమయంలో నాగుపాము మణికంఠ రెడ్డి చేయిపై కాటు వేసింది.

అప్పటికీ మద్యం మత్తులో ఉన్న పాములు ఆడించే వెంకటస్వామి పాముకు కోరలు లేవని, కరిచినా ఏమీ కాదు అంటూ చెప్పాడు. ఆ తర్వాత అక్కడి నుంచి జారుకున్నాడు. అయితే చేతిపై గాట్లు ఉండటంతో ఎందుకైనా మంచిదని మణికంఠను అతడి స్నేహితులు స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మణికంఠ రెడ్డి అపస్మారక స్థితిలోనికి వెళ్ళిపోయాడు. పరిస్థితి విషమంగా ఉందని గుర్తించిన స్థానిక వైద్యులు ఒంగోలు ఆస్పత్రికి సిఫార్సు చేశారు. మార్గమధ్యలోనే మణికంఠ చనిపోయాడు. మణికంఠను కాటువేసింది అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా జాతి పాముగా వైద్యులు చెబుతున్నారు.

తాను పాముతో చెలగాటమాడిన విషయం తన తల్లిదండ్రులకు తెలిస్తే తిడుతారన్న భయంతో ఫొటోలను, వీడియోలను మణికంఠ తన ఫోన్ నుంచి అంతకుముందే తొలగించాడు. పాములు ఆడించే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడి కోసం గాలిస్తున్నారు.

First Published:  26 Jan 2023 6:34 AM GMT
Next Story