Telugu Global
Andhra Pradesh

ప్రొద్దుటూరులో టీడీపీ నేతలకు షాక్.. 81 ఏళ్ల వరదరాజుల రెడ్డికి టికెట్

వరదరాజుల రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమకాలికుడు. 1985లో మొదటిసారి ప్రొద్దుటూరు నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ప్రొద్దుటూరులో టీడీపీ నేతలకు షాక్.. 81 ఏళ్ల వరదరాజుల రెడ్డికి టికెట్
X

ఇవాళ టీడీపీ రెండో జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే అందులో ఎవరూ ఊహించని విధంగా రాజకీయాల్లో కురువృద్ధుడైన మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డికి టీడీపీ ప్రొద్దుటూరు టికెట్ కేటాయించింది. అయితే వరదకు టికెట్ కేటాయింపు అంశం స్థానిక నాయకులు షాక్ కు గురిచేయ‌గా.. నియోజకవర్గ ప్రజలను కూడా ఆశ్చర్యపరిచింది. అందుకు కారణం కొన్నేళ్లుగా వరదరాజుల‌రెడ్డి రాజకీయాల్లో క్రియాశీలకంగా లేకపోవడమే.

పార్టీలో కొనసాగని, 81 ఏళ్ల వరదరాజుల రెడ్డికి టీడీపీ టికెట్ కేటాయించడంతో నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి నిరాశలో కూరుకుపోయారు.

వరదరాజుల రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమకాలికుడు. 1985లో మొదటిసారి ప్రొద్దుటూరు నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటినుంచి ఆయన అదే పార్టీ నుంచి వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1985 నుంచి 2009 వరకు 25 ఏళ్ల పాటు ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా ఉన్నారు.

2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఆయన టీడీపీ అభ్యర్థి లింగారెడ్డి చేతిలో ఓడిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత వరదరాజుల రెడ్డి కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరారు. 2014, 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థిగా వరద పోటీ చేయగా.. రాజకీయంగా తన శిష్యుడైన వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.

గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి వరదరాజుల రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన రాజకీయాలకు దూరం కావడంతో ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ కోసం లింగారెడ్డి, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి, సీఎం రమేష్ సోదరుడు సురేష్ నాయుడు పోటీ పడుతూ వచ్చారు. ఉక్కు ప్రవీణ్ అయితే టికెట్ వచ్చేది తనకేనంటూ నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని కూడా చేపట్టారు.

పరిస్థితి ఈ విధంగా ఉండగా కొన్ని నెలల కిందట వరదరాజుల రెడ్డి మళ్ళీ రాజకీయంగా క్రియాశీలకమయ్యారు. వరదరాజుల రెడ్డి మళ్లీ యాక్టివ్ కావడంతో ప్రొద్దుటూరు టీడీపీ మూడు వర్గాలుగా మారింది. లింగారెడ్డి, సీఎం సురేష్ నాయుడు ఒక వర్గంగా ఉండగా.. ఉక్కు ప్రవీణ్, వరద మరో రెండు వర్గాలుగా విడిపోయి రాజకీయాలు నడుపుతూ వచ్చారు.

యువకుడు, నారా లోకేష్ మద్దతు ఉన్న ఉక్కు ప్రవీణ్ కే ఈసారి ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ ఖాయమని అందరూ భావిస్తున్న సమయంలో చంద్రబాబు ఎవరూ ఊహించని విధంగా వరదరాజుల రెడ్డికి టికెట్ కేటాయించారు. దీంతో లింగారెడ్డి, ఉక్కు ప్రవీణ్ వర్గాలు తీవ్ర నిరాశలో కూరుకుపోయాయి. ఈసారి ప్రొద్దుటూరులో ఎలాగైనా వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని ఓడించేందుకే ఆర్థికంగా బలంగా ఉన్న వరదరాజుల రెడ్డి వైపు చంద్రబాబు మొగ్గు చూపారని తెలుస్తోంది.

First Published:  14 March 2024 1:38 PM GMT
Next Story