Telugu Global
Andhra Pradesh

ముగ్గురు ఎమ్మెల్యేల‌కు షాక్ తప్పదా..?

రెండు నియోజకవర్గాల్లో కూడా ఆనంపై వ్యతిరేకత కనబడుతోంది. సర్వేపల్లిలో పోటీచేయిస్తే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు ఎంపీగా పోటీచేసే అవకాశాలున్నాయి.

ముగ్గురు ఎమ్మెల్యేల‌కు షాక్ తప్పదా..?
X

ముగ్గురు ఎమ్మెల్యేల‌కు చంద్రబాబు నాయుడు షాకివ్వబోతున్నట్లు సమాచారం. రాబోయే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఎవరిని ఎక్కడ పోటీచేయించాలి, ఎవరికి కోత వేయాలనే విషయమై చంద్రబాబు ఆలోచిస్తున్నారట. సిట్టింగ్ ఎమ్మెల్యేలంటే టీడీపీ నుంచి గెలిచిన వారే కాకుండా వైసీపీ నుంచి వ‌ల‌స వ‌చ్చిన వారూ ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యేల్లో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి టికెట్ లేనట్లే అని సమాచారం. ఈ సీటులో జనసేన పోటీచేయబోతోంది.

అలాగే రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానికి బదులుగా ఆమె భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ పోటీ ఖాయమైపోయింది. ఇక టీడీపీకి దగ్గరైన వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి నెల్లూరు రూరల్ నుండే పోటీచేయబోతున్నారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పోటీ విషయంలో క్లారిటి రాలేదు. ఎందుకంటే.. వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురగొండ్ల రామకృష్ణ ఆనంను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ద్వితీయశ్రేణి నేతలు, క్యాడర్ కూడా ఒప్పుకోవటంలేదు. అందుకనే ఆనంను సర్వేపల్లి లేదా ఆత్మకూరులో పోటీచేయించే అవకాశాలున్నాయట.

అయితే పై రెండు నియోజకవర్గాల్లో కూడా ఆనంపై వ్యతిరేకత కనబడుతోంది. సర్వేపల్లిలో పోటీచేయిస్తే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు ఎంపీగా పోటీచేసే అవకాశాలున్నాయి. ఆత్మకూరు విషయం ఇంకా తేలలేదు. ఇదే సమయంలో మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలకు మొండిచెయ్యి తప్పదని తేలిపోయింది. మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవికి టికెట్లిచ్చే పరిస్థితి కనబడటంలేదు. వీళ్ళిద్దరినీ టీడీపీలో నేతలు, క్యాడర్ మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నారట. వీళ్ళిద్దరికీ టికెట్లు ఇవ్వటం కష్టమని ఇప్పటికే చంద్రబాబు చెప్పేసినట్లు పార్టీ వర్గాల సమాచారం.

ఇప్పటికి ఖాయంగా బయటపడిన నియోజకవర్గాల పరిస్థితిదే. పొత్తులో జనసేన ఎన్ని నియోజకవర్గాల్లో పోటీచేయబోతోంది..? ఏ నియోజకవర్గాల్లో పోటీచేస్తుందనేది తేలాలి. అప్పుడు ఇంకెంతమంది తమ్ముళ్ళకి షాక్ తగులుతుందన్నది ఫైనల్ అవుతుంది. మొత్తంమీద చాలామంది తమ్ముళ్ళల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఇప్పుడు కూడా పొత్తులను చంద్రబాబు ఫైనల్ చేసి తమ్ముళ్ళకి, క్యాడర్ కు క్లారిటీ ఇవ్వాలని అనుకోకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.

First Published:  13 Dec 2023 5:15 AM GMT
Next Story