Telugu Global
Andhra Pradesh

తనిఖీల్లో పట్టుబడిన 300 కేజీల బంగారం సీజ్

దేశంలో అత్యధిక బంగార క్రయవిక్రయాలు జరిగే ముంబై తర్వాత స్థానం ప్రొద్దుటూరుదే.

తనిఖీల్లో పట్టుబడిన 300 కేజీల బంగారం సీజ్
X

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బయటకు రూ.50 వేల కంటే ఎక్కువ తీసుకెళ్తే పోలీసులు దానిపై ఆరా తీస్తున్నారు. సరైన రసీదులు లేకపోతే తెలంగాణ పోలీసులు జప్తు చేస్తున్నాయి. డబ్బు, బంగారం, మద్యం.. ఏదైనా సరే పోలీసుల చేతికి చిక్కితే ఇక వాటిపై ఆశలు వదులుకోవల్సిందే. తాజాగా 300 కేజీల బంగారాన్ని ఐటీ అధికారులు సీజ్ చేశారు. అయితే ఈ బంగారం ఎన్నికలు జరుగనున్న తెలంగాణలో కాకపోవడం గమనార్హం.

ఏపీలోని వైఎస్ఆర్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దేశంలో అత్యధిక బంగార క్రయవిక్రయాలు జరిగే ముంబై తర్వాత స్థానం ప్రొద్దుటూరుదే. ఇక్కడ బంగారం కొనడానికి ఏపీ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. ఈ నేపథ్యంలో గత నాలుగు రోజులుగా ప్రొద్దుటూరులని పలు జ్యూవెలర్స్, డైమెండ్ దుకాణాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

ప్రొద్దటూరులోని బుశెట్టి జువెలర్స్, గురురాఘవేంద్ర, తల్లం జువెలర్స్‌లో సోదాలు చేయగా.. దాదాపు 300 కేజీల అక్రమ బంగారం లభించింది. ఇతర ప్రాంతాల నుంచి ఈ బంగారాన్ని బిల్లులు లేకుండా ప్రొద్దటూరుకు తరలించినట్లు ఐటీ అధికారులు చెబుతున్నారు. 300 కేజీల బంగారాన్ని అట్టపెట్టెలు, సూట్‌కేసుల్లో భద్రపరిచి.. అత్యంత భద్రత మధ్య తిరుపతికి తరలించారు.

ప్రొద్దటూరులో జరుగుతున్న సోదాల విషయం తెలుసుకొని చుట్టుపక్కల జిల్లాల వ్యాపారులు అప్రమత్తం అయ్యారు. కేవలం బంగారం వ్యాపారులే కాకుండా స్వర్ణకారులు కూడా తమ దగ్గర ఉంచిన బంగారానికి రసీదులు వెదికే పనిలో పడ్డారు. దసరా సమయం కావడంతో చాలా మంది బంగారం వర్తకులు భారీ ఎత్తున నిల్వ చేశారు. ఇదే సమయంలో ఐటీ దాడులు జరగడంతో ప్రొద్దటూరు చుట్టు పక్కల షాపులను మూసేశారు.

First Published:  22 Oct 2023 11:29 AM GMT
Next Story