Telugu Global
Andhra Pradesh

ఈ కుటుంబాల చరిత్ర క్లైమాక్స్‌కు చేరినట్లేనా..?

దశాబ్దాల రాజకీయ చరిత్రలో కర్నూలు జిల్లాను ఏలిన కోట్ల, కేఈ, భూమా కుటుంబాల చరిత్ర దాదాపు క్లైమాక్స్‌కు చేరుకున్నట్లే అనుకోవాలి. వచ్చేఎన్నికలే ఈ మూడు కుటుంబాలకు చివరి ఎన్నికలా అనేట్లుగా ఉంది.

ఈ కుటుంబాల చరిత్ర క్లైమాక్స్‌కు చేరినట్లేనా..?
X

మనం కొనేవస్తువుల్లో చాలావాటికి ఎక్సపయిరీ డేట్ ఉంటుంది. ఆ డేట్ ఉన్నంతవరకు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఎక్సపయిరీ డేట్ దాటితే ఇక వాటి ప్రభావం కనబడదు. ఇదే సూత్రం రాజకీయాల్లో కొన్ని కుటుంబాలకు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు విషయం ఏమిటంటే.. దశాబ్దాల రాజకీయ చరిత్రలో కర్నూలు జిల్లాను ఏలిన కోట్ల, కేఈ, భూమా కుటుంబాల చరిత్ర దాదాపు క్లైమాక్స్‌కు చేరుకున్నట్లే అనుకోవాలి. వచ్చేఎన్నికలే ఈ మూడు కుటుంబాలకు చివరి ఎన్నికలా అనేట్లుగా ఉంది.

కోట్ల విజయభాస్కరరెడ్డి, భూమా దంపతులు నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి ఉన్నంతవరకు జిల్లాలో ఈ కుటుంబాల ఆధిపత్యానికి తిరుగేలేదు. అధికారంలో ఎవరున్నారు అనేదాంతో సంబంధం లేకుండా వీళ్ళ హవా నడిచింది. ఎప్పుడైతే విజయభాస్కరరెడ్డి పోయారో ఆయన వారసుడిగా కొడుకు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కొంతకాలం నెట్టుకొచ్చారు. కర్నూలు ఎంపీగా గెలిచి కేంద్రంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఎంపీగా గెలిచినా మంత్రిగా పనిచేసినా అదంతా కేవలం తండ్రి చలవే. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కోట్ల పలుకుబడి పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు టీడీపీ నేతగా ఉన్నా 2024లో గెలవకపోతే ఇక కోట్ల ఫ్యామిలీని జనాలు మరచిపోవటం ఖాయం.

ఇక భూమా ఫ్యామిలీని తీసుకుంటే దంపతులిద్దరూ మంచి దూకుడుమీదుండేవారు. ఏపార్టీలో ఉన్నా వీళ్ళ పలుకుబడికి ఎదురేలేదన్నట్లుగా ఉండేది. అలాంటిది కొద్దికాలం గ్యాప్ లోనే దంపతులిద్దరు మరణించారు. వీళ్ళ వారసురాలిగా భూమా అఖిలప్రియ వచ్చినా ఆధిపత్యాన్ని నిలబెట్టుకోలేకపోయింది. పైగా తన ఒంటెద్దుపోకడలతో, నోటి దురుసుతో అందరినీ దూరం చేసుకుని ఉనికి కోసమే నానా అవస్థ‌లు పడుతోంది. రేపటి ఎన్నికల్లో టికెట్ రాకపోయినా, గెలవకపోయినా రాజకీయాల్లో భూమా ఫ్యామిలీ పట్టు దాదాపు జారిపోయినట్లే.

ఇదే సమయంలో కేఈ ఫ్యామిలీ కూడా ఇబ్బందులు పడుతోంది. కేఈ కృష్ణమూర్తి కారణంగా తమ్ముళ్ళు కేఈ ప్రభాకర్, కేఈ ప్రతాప్ విపరీతమైన అధికారాలను చెలాయించారు. అయితే కేఈకి బాగా వయసైపోవటం, రాజకీయాల నుంచి తప్పుకోవటంతో కేఈ కుటుంబం పట్టుకూడా జారిపోయింది. కొడుకు కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. వచ్చే ఎన్నికల్లో అన్నదమ్ముల్లో ఎవరైనా గెలిస్తే ఓకే. లేకపోతే మాత్రం జిల్లా రాజకీయాల్లో ఈ కుటుంబం ప్రభావం చరిత్రగా మిగిలిపోతుంది. విచిత్రం ఏమిటంటే మూడు కుటుంబాలకు వచ్చేఎన్నికలే పరీక్షగా నిలవబోతున్నాయి.

First Published:  26 Dec 2022 5:36 AM GMT
Next Story