Telugu Global
Andhra Pradesh

12వ పీఆర్సీ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం..

PRC ఛైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి మన్మోహన్‌ సింగ్‌ ను ప్రభుత్వం నియమించింది. ఏడాదిలోగా PRC నివేదిక ఇవ్వాలని కోరింది.

12వ పీఆర్సీ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం..
X

ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. 12వ పే రివిజన్ కమిషన్ (PRC) ఏర్పాటు చేసింది. ఈరోజు కేబినెట్ భేటీ అనంతరం ఈమేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. PRC ఛైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి మన్మోహన్‌ సింగ్‌ ను ప్రభుత్వం నియమించింది. ఏడాదిలోగా PRC నివేదిక ఇవ్వాలని కోరింది. వివిధ ప్రభుత్వ శాఖలు, కేటగిరీలకు చెందిన ఉద్యోగులందరి వివరాలు, వారికి సంబంధించిన అంశాలతో పాటు స్థానికంగా ఉన్న పరిస్థితులు, కరవు భత్యంపై అధ్యయనం చేసి సిఫార్సులు చేయాలని సూచించింది.

గత కేబినెట్ లోనే పీఆర్సీపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజా కేబినెట్ భేటీ అనంతరం పీఆర్సీ నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఎన్నికల ఏడాదిలో పీఆర్సీ నియామకం కీలకంగా మారింది. ఈ పీఆర్సీలో ఉద్యోగుల అంచనాలకు తగ్గట్టే ఫిట్ మెంట్ రూపొందించే అవకాశముంది. ఎన్నికల టైమ్ దగ్గరపడింది కాబట్టి ఉద్యోగులను ప్రసన్నం చేసుకోడానికి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఈ ప్రయత్నం పీఆర్సీ రిపోర్ట్ లో ప్రతిబింబిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఏపీ సీఎం గా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత 27 శాతం ఐఆర్ ప్రకటించారు. పీఆర్సీ లో ఫిట్ మెంట్ అంతకంటే ఎక్కువ ఉంటుందని ఉద్యోగులు భావించారు. కానీ, అంతకంటే తక్కువగా 23.29 శాతం ఫిట్ మెంట్ ఖరారు చేయటంతో ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. అదే సమయంలో ఉద్యోగులకు చెందిన జీపీఎఫ్..ఏపీజీఎల్ఐ నిధులు కూడా ప్రభుత్వం అవసరాలకు వినియోగించుకుందనే ఆరోపణలు ఉన్నాయి. పెండిండ్ డీఏలు చెల్లించాల్సి ఉంది. ఈ క్రమంలో ఒక్కో డిమాండ్ ను ప్రభుత్వం పరిష్కరిస్తూ వస్తోంది. తాజాగా 12వ పీఆర్సీ ప్రకటించింది. ఈసారయినా ఫిట్ మెంట్ విషయంలో జగన్ ఉదారంగా ఉంటారని ఉద్యోగులు ఆశపడుతున్నారు.

First Published:  12 July 2023 12:40 PM GMT
Next Story