"కండోమ్‌లు ఎక్కువగా ఉపయోగిస్తుంది మేమే"- RSS చీఫ్‌కు అసదుద్దీన్ ఒవైసీ సమాధానం

దేశంలో ముస్లింల జనాబా క్రమక్రమంగా తగ్గుతున్నదని MIM చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ముస్లింల జనాభా పెరిగి హిందువుల జనాభా తగ్గిపోతున్నదని ఆరెస్సెస్ ఛీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే - 5ని ఉదహరిస్తూ ముస్లింల సంతానోత్పత్తి రేటు (TFR) అత్యధికంగా పడిపోయిందని అన్నారు.

Advertisement
Update: 2022-10-09 06:40 GMT

దేశంలో ముస్లింల జనాభా పెరిగి హిందువుల జనాభా తగ్గిపోతున్నదని ఆరెస్సెస్ ఛీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై MIM చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.

దేశంలో తామే అత్యధికంగా కండోమ్ లు వాడుతున్నామని ఓవైసీ అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ సభకు సంబంధించిన వీడియోను ఒవైసీ ట్వీట్ చేశారు. ఆ వీడియోలో, "ముస్లింల జనాభా పెరగడం లేదు, బదులుగా తగ్గుతోంది, ముస్లింలలో పిల్లల మధ్య అంతరం కూడా పెరుగుతోంది, కండోమ్‌లు ఎక్కువగా ఎవరు ఉపయోగిస్తున్నారు ? మేమే... మోహన్ భగవత్ దీని గురించి మాట్లాడరు" అని ఒవైసీ అన్నారు.

భారతదేశ జనాభా నియంత్రణకు అందరికీ సమానంగా వర్తించే విధానం అవసరమని బిజెపి సైద్ధాంతిక గురువు, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించిన తర్వాత ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ వార్షిక దసరా ర్యాలీలో ఆయన చేసిన వ్యాఖ్యలలో, జనాభాలో "మత ఆధారిత అసమతుల్యత" పెరిగిపోయిందని మోహన్ భగవత్ అన్నారు.

దీనిపై మాట్లాడిన ఓవైసీ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే - 5ని ఉదహరిస్తూ ముస్లింల సంతానోత్పత్తి రేటు (TFR) అత్యధికంగా పడిపోయిందని అన్నారు.

తప్పిపోయిన హిందూ బాలికల గురించి మాట్లాడటానికి RSS చీఫ్ ఎందుకు ధైర్యం చేయడం లేదని ఓవైసీ ప్రశ్నించారు "నేను మోహన్ భగవత్‌ని అడగాలనుకుంటున్నాను. 2000 నుండి 2019 వరకు మా హిందూ సోదరీమణుల కుమార్తెలు లక్షల మంది తప్పిపోయారు. ఇది ప్రభుత్వ లెక్క. కానీ అతను దాని గురించి మాట్లాడడు" అని ఆయన అన్నారు.

"గుర్తుంచుకోండి, హిందూ రాష్ట్రం అనేది భారత జాతీయవాదానికి వ్యతిరేకం. ఇది భారతదేశానికి వ్యతిరేకం" ఒవైసీ అన్నారు.

బీజేపీ ఎక్కడ అధికారంలో ఉన్నా ముస్లింలు 'బహిరంగ జైలులో జీవిస్తున్నట్లు' కనిపిస్తోందని ఒవైసీ అన్నారు.

ఇటీవల గుజరాత్‌లో గర్బా ఉత్సవంపై రాళ్లు రువ్వారని ఆరోపించి కొందరు వ్యక్తులను స్తంభానికి కట్టేసి బహిరంగంగా కొరడాలతో కొట్టిన ఘటనపై ప్రధాని మౌనం వహించడాన్ని ఆయన ప్రశ్నించారు. "ఇదేనా మాకిచ్చేగౌరవం? ప్రధాని గారూ, మీరు గుజరాత్ కు ముఖ్యమంత్రిగా చేశారు. మీ రాష్ట్రంలో ముస్లింలను స్తంభానికి కట్టి కొరడాలతో కొడుతూ ఉంటే అక్కడున్న జనం ఈ సంఘటనను చూస్తూ ఈలలు వేశారు. దయచేసి కోర్టులను మూసివేయండి, పోలీసు బలగాలను తొలగించండి" అని ఓవైసీ అన్నారు.

Tags:    
Advertisement

Similar News