తమ్ముళ్లు.. మీ మధ్య ఎందుకు గొడవ.. బీఆర్ఎస్‌తో కొట్లాడండి.. రేవంత్, ఈటలకు రాములమ్మ క్లాస్

ప్రతిపక్షాల నేతలు పరస్పరం దాడులు చేసుకుంటుంటే అధికార పార్టీ వేడుకలా చూస్తోందన్నారు. రేవంత్, ఈటల ఒకరిపై ఒకరు కాకుండా ప్రభుత్వంపై పోరాడాలని విజయశాంతి సూచించారు.

Advertisement
Update: 2023-04-22 10:56 GMT

ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కాంగ్రెస్ కు సీఎం కేసీఆర్ రూ.25 కోట్లు ఇచ్చినట్లు ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం సృష్టించాయి. ఈటల ఆరోపణలకు రేవంత్ రెడ్డి కూడా దీటుగా స్పందించారు. ఈటలవి దిగజారుడు రాజకీయాలని మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికలో ఖర్చుపెట్టిన ప్రతి రూపాయి కాంగ్రెస్ దేనని తేల్చిచెప్పారు.

కేసీఆర్ నుంచి డబ్బు తీసుకోలేదని చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరకు వచ్చి ప్రమాణం చేస్తానని, తీసుకున్నామని నువ్వు ప్రమాణం చేయగలవా? అని రేవంత్ సవాల్ విసిరారు. ఇలా కాంగ్రెస్, బీజేపీ మధ్య సవాళ్ల వార్ నడుస్తుండగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈటల, రేవంత్ లకు సర్ది చెబుతూనే చురకలంటించారు.


బీఆర్ఎస్ తో పోరాడే తమ్ముళ్లు రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్.. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం సరికాదని సూచించారు. ఎవరి ధోరణిలో వారు ప్రభుత్వంపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై ఇద్దరు నేతలు ఆలోచించుకోవాలని సూచించారు. దేశంలోనే అత్యంత ధన ప్రభావిత ఎన్నికలు జరిగే ప్రాంతం తెలంగాణ అని.. దీనికి కారణమైన దుర్మార్గ వ్యవస్థపై పోరాడాల్సిన కర్తవ్యం అందరిపై ఉందన్నారు.

ప్రతిపక్షాల నేతలు పరస్పరం దాడులు చేసుకుంటుంటే అధికార పార్టీ వేడుకలా చూస్తోందన్నారు. రేవంత్, ఈటల ఒకరిపై ఒకరు కాకుండా ప్రభుత్వంపై పోరాడాలని విజయశాంతి సూచించారు. నిరంతర తెలంగాణ ఉద్యమకారిణిగా ప్రజల అభిప్రాయం చెప్పడం ఈ సందర్భంగా తన బాధ్యత అనిపించిందని ఆమె చెప్పారు. కాగా రేవంత్, ఈటలను ఉద్దేశించి విజయశాంతి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్ల నుంచి కూడా మద్దతు లభించింది. ఆమె వ్యాఖ్యలను సపోర్ట్ చేస్తూ పలువురు కామెంట్స్ చేశారు.

Tags:    
Advertisement

Similar News