నేడు కరీంనగర్ కు కేసీఆర్.. రైతులతో ముఖాముఖి

కేసీఆర్ వరుస పర్యటనలతో కాంగ్రెస్ ప్రభుత్వం హడావిడి పడుతోంది. కరీంనగర్ పర్యటనలో ఆయన ఏయే అంశాలను ప్రస్తావిస్తారు, ప్రభుత్వాన్ని ఎలా ఇరుకున పెడతారు అనేది ఆసక్తిగా మారింది.

Advertisement
Update: 2024-04-04 23:56 GMT

ఇటీవల ఉమ్మడి నల్లగొండ జిల్లా పర్యటనలో రైతుల కష్టాలు తెలుసుకున్న కేసీఆర్, ఈరోజు కరీంనగర్ లో ఎండిన పంటలను పరిశీలించబోతున్నారు. మొగ్దుంపూర్ లో ఎండిన పంటల పరిశీలన అనంతరం రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు, వారి కష్టాలను అడిగి తెలుసుకుంటారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు డీ-93 పరిధిలోని మొగ్దుంపూర్‌లో యాసంగిలో సాగుచేసిన 60 శాతం పంటలు ఎండిపోయాయి. ఈ కాల్వ మొదట్లో ఉన్న భూములు కూడా నీళ్లందక ఎండిపోవడం విచారకరం. ఇక ఆయకట్టు చివరి భూముల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడి రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. వారిని పరామర్శించేందుకు కేసీఆర్ ఈరోజు కరీంనగర్ వెళ్తున్నారు.

కరీంనగర్ షెడ్యూల్‌

ఈరోజు ఉదయం 8:30 గంటలకు సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రం నుంచి బయలుదేరి 10:30 గంటలకు కరీంనగర్‌ రూరల్‌ మండలం మొగ్దుంపూర్‌కు చేరుకుంటారు కేసీఆర్. పంటల పరిశీలన అనంతరం రైతులతో ముఖాముఖి మాట్లాడతారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కరీంనగర్‌లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ నివాసంలో భోజనం చేస్తారు. అక్కడినుంచి రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లికి వెళ్తారు. పంటలను పరిశీలించిన అనంతరం రైతులతో మాట్లాడతారు. మధ్యాహ్నం 3 గంటలకు శాభాష్‌పల్లి వంతెనపైకి చేరుకొని మధ్యమానేరు జలాశయాన్ని పరిశీలిస్తారు. సాయంత్రం 4 గంటలకు సిరిసిల్లలోని తెలంగాణభవన్‌కు చేరుకొని మీడియాతో మాట్లాడతారు. అక్కడినుంచి నేరుగా ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రానికి చేరుకుంటారు.

కేసీఆర్ వరుస పర్యటనలతో కాంగ్రెస్ ప్రభుత్వం హడావిడి పడుతోంది. నల్లగొండ జిల్లా పర్యటన అనంతరం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. ప్రాజెక్ట్ ల నిర్వహణ విషయంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందని ఆయన గుర్తు చేశారు. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. కేసీఆర్ పర్యటన అనంతరం గంటల వ్యవధిలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో బాహుబలి మోటార్లను ఆన్ చేశారు. కాల్వల్లో నీరు పారింది. ఇప్పుడు కరీంనగర్ పర్యటనలో ఆయన ఏయే అంశాలను ప్రస్తావిస్తారు, ప్రభుత్వాన్ని ఎలా ఇరుకున పెడతారు అనేది ఆసక్తిగా మారింది. 

Tags:    
Advertisement

Similar News