జమిలీ ఎన్నికలపై వెనక్కి తగ్గిన కేంద్రం.. అసలు కారణం ఇదే

దేశంలో ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగంలోని కనీసం ఐదు ఆర్టికల్స్‌కు సవరణ చేయాల్సి ఉంటుంది.

Advertisement
Update: 2023-07-28 01:14 GMT

దేశమంతా ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలని కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వం.. ప్రస్తుతం ఆ ప్రతిపాదనపై వెనక్కి తగ్గింది. జమిలీ ఎన్నికల నిర్వహణ లబ్ధి పొందాలని భావించిన మోడీ సర్కార్ ఆ ప్రతిపాదనను విరమించుకున్నది. ఈ మేరకు పార్లమెంటులో ఒక ప్రకటన చేసింది. దేశమంతా ఒకే సారి పార్లమెంట్, అసెంబ్లీలకు ఎన్నికల నిర్వహించడం సాధ్యపడదని తేల్చి చెప్పింది. పార్లమెంటులో జమిలీ ఎన్నికల నిర్వహణపై పలువురు ఎంపీలు అడిగిన సభ్యులకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

దేశంలో ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగంలోని కనీసం ఐదు ఆర్టికల్స్‌కు సవరణ చేయాల్సి ఉంటుంది. ఆర్టికల్ 83(పార్లమెంట్ కాల వ్యవధి), ఆర్టికల్ 85(లోక్‌సభ రద్దు), ఆర్టికల్ 172 (రాష్ట్ర అసెంబ్లీల కాల వ్యవధి), ఆర్టికల్ 174(రాష్ట్ర అసెంబ్లీల రద్దు), ఆర్టికల్ 356(రాష్ట్రపతి పాలన విధింపు) వంటి ఆర్టికల్స్‌ను సవరించాల్సి ఉంటుంది. ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రాష్ట్రాల ఏకాభిప్రాయాన్ని పొందాల్సి ఉంటుంది. ఇప్పటి పరిస్థితుల్లో అందరినీ ఏకతాటిపైకి తీసుకొని రావడం కష్టమే.

మరోవైపు జమిలీ ఎన్నికల కోసం భారీగా ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలు అవసరమవుతాయి. దేశవ్యాప్తంగా భారీగా భద్రతా బలగాలను మోహరించడం కూడా సాధ్యపడే అవకాశం లేదని అర్జున్ మేఘ్వాల్ తెలిపారు. అందుకే జమిలీ ఎన్నికల నిర్వహణ సాధ్యపడబోదని లా కమిషన్‌కు సిఫారసు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో మోడీ ప్రభుత్వం గత కొన్నాళ్లుగా చేస్తున్న 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' అనే నినాదం పక్కకు పెట్టినట్లే అని తెలుస్తున్నది.

Tags:    
Advertisement

Similar News