పెండింగ్ బిల్లులు హాట్ టాపిక్.. మళ్లీ తెరపైకి గవర్నర్ తమిళిసై

గవర్నర్‌ తమిళిసై వద్ద ఎలాంటి బిల్లులు పెండింగ్‌ లో లేవని రాజ్ భవన్ స్పష్టం చేసింది. గతంలోనే 3 బిల్లులను గవర్నర్‌ ఆమోదించారని, మరో 2 బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపారని పేర్కొంది.

Advertisement
Update: 2023-07-10 10:49 GMT

ఇటీవల ఉస్మానియా ఆస్పత్రి వ్యవహారంతో తెలంగాణ గవర్నర్ తమిళిసై తెరపైకి వచ్చారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేయడంతోపాటు హడావిడిగా ఆస్పత్రిని తనిఖీ చేశారామె. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ప్రధాని మోదీ వరంగల్ పర్యటన తర్వాత కూడా మరోసారి రాజ్ భవన్ వ్యవహారం చర్చల్లోకొచ్చింది. తెలంగాణ గురించి మాట్లాడే మోదీ, ముందు గవర్నర్ దగ్గరున్న పెండింగ్ బిల్లుల గురించి తెలుసుకోవాలంటూ చురకలంటించారు మంత్రి హరీష్ రావు. దీంతో పెండింగ్ బిల్లులపై రాజ్ భవన్ తాజాగా వివరణ ఇచ్చింది. తమ దగ్గర అలాంటి బిల్లులేవీ లేవని ఓ ప్రకటన విడుదల చేసింది.

తెలంగాణ ప్రభుత్వం పంపించిన అనేక బిల్లుల్ని గతంలో వివిధ కారణాలతో తొక్కిపట్టారు గవర్నర్ తమిళిసై. మూడు బిల్లులను బాగా ఆలస్యంగా ఆమోదించారు. మిగతా వాటి విషయంలో కూడా ఆమె సానుకూలంగా స్పందిస్తారనుకున్నా కుదర్లేదు. అయితే ఇప్పుడు గవర్నర్ తమిళిసై ఆ బిల్లుల విషయంలో స్పందించారు. ఆమె ఆదేశాల మేరకు రాజ్ భవన్ వర్గాలు పెండింగ్ బిల్లులపై ప్రకటన విడుదల చేశాయి.

గవర్నర్‌ తమిళిసై వద్ద ఎలాంటి బిల్లులు పెండింగ్‌ లో లేవని రాజ్ భవన్ స్పష్టం చేసింది. గతంలోనే 3 బిల్లులను గవర్నర్‌ ఆమోదించారని, మరో 2 బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపారని పేర్కొంది. మిగిలిన బిల్లులపై వివరణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి పంపినట్లు ఆ ప్రకటన ద్వారా తెలుస్తోంది. మొత్తమ్మీద తమ వద్ద ఎలాంటి బిల్లులు పెండింగ్ లో లేవని చెప్పాయి రాజ్ భవన్ వర్గాలు. ఈ ప్రకటనపై ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందో చూడాలి. 

Tags:    
Advertisement

Similar News