జయసుధ లోపలికి.. విజయశాంతి బయటకు..!

ఈ వార్తలకు బలం చేకూర్చేలా శనివారం తొలిదశ మంతనాలు పూర్తయ్యాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో జయసుధ భేటీ అయ్యారు.

Advertisement
Update: 2023-07-30 01:54 GMT

సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ మళ్లీ రాజకీయంగా యాక్టివ్ కాబోతున్నట్టు తెలుస్తోంది. సరిగ్గా ఎన్నికల ఏడాదిలో ఆమె బీజేపీ కండువా కప్పుకోబోతున్నారని, ముషీరాబాద్ లేదా, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె కమలదళం అభ్యర్థిగా బరిలో దిగుతారని అంటున్నారు. ఈ వార్తలకు బలం చేకూర్చేలా శనివారం తొలిదశ మంతనాలు పూర్తయ్యాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో జయసుధ భేటీ అయ్యారు. అంతకు ముందే ఆమె ఈటల రాజేందర్ తో కూడా మంతనాలు జరిపారు. అయితే కిషన్ రెడ్డితో జరిగిన సమావేశం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆమె చేరిక లాంఛనమేనని తెలుస్తోంది.

2009లో సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన జయసుధ, 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మళ్లీ ఇన్నాళ్లకు ఆమె బీజేపీలో చేరి తిరిగి పాలిటిక్స్ లో యాక్టివ్ కాబోతున్నారని తెలుస్తోంది. జయసుధ చేరిక విషయంలో ఉత్తర తెలంగాణకు చెందిన ఓ సినీ నిర్మాత కీలకంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. అయితే ఇదంతా ప్రస్తుతం బీజేపీ వర్గాల మాట, జయసుధ వైపునుంచి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు.

విజయశాంతి రూటు ఎటు..?

ఇక పార్టీలో సర్దుబాటు కాలేకపోతున్న సినీనటి విజయశాంతి, బీజేపీ నుంచి బయటకు వచ్చేస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. కొంతకాలంగా విజయశాంతి ట్విట్టర్ మినహా మిగతా కార్యక్రమాల్లో యాక్టివ్ గా లేరు. పార్టీ కూడా ఆమెను పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎప్పటికప్పుడు ఈ వార్తల్ని విజయశాంతి ఖండిస్తూనే ఉన్నా ఆమె పార్టీ మారడం మాత్రం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Tags:    
Advertisement

Similar News