ముగిసిన పోలింగ్.. క్యూలైన్లలో ఉన్నవారికి అవకాశం

మొత్తం 119 నియోజకవర్గాల్లో 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. మిగతా 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది.

Advertisement
Update: 2023-11-30 11:30 GMT

తెలంగాణలో పోలింగ్ అధికారికంగా ముగిసింది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసినట్టు అధికారులు ప్రకటించారు. అయితే కొన్ని పోలింగ్ బూత్ ల ముందు ఇంకా క్యూలైన్లు కనపడుతున్నాయి. క్యూలైన్లో వేచి ఉన్నవారందిరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు అధికారులు. మొత్తం 119 నియోజకవర్గాల్లో 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. మిగతా 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది.

ఈ సారి పోలింగ్ మందకొడిగా సాగినట్టు తెలుస్తోంది. 2018తో పోల్చి చూస్తే గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మధ్యాహ్నం 3 గంటల సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 51.89 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మెదక్‌ జిల్లాలో అత్యధికంగా 69.33 శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 31.17 శాతం పోలింగ్‌ నమోదైంది. 5 గంటల లెక్కలు కాసేపట్లో అధికారికంగా విడుదలవుతాయి.

పోలింగ్ సరళి ఉదయం నుంచే కాస్త మందకొడిగా ఉంది. ఉదయం తొలి గంటలోనే నటీనటులు, రాజకీయ నాయకులు చాలా వరకు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం వరకు పోలింగ్ శాతం పెరగలేదు. చివరి గంటలో అక్కడక్కడా క్యూలైన్లలో రద్దీ కనిపించింది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో అక్కడ అదనపు సమయం ఇవ్వాలని ఈసీకి కాంగ్రెస్ లేఖ రాసింది. కొన్ని నియోజకవర్గాల్లో చెదురుమదురు ఘటనలు జరిగాయి, పోలీసులు వెంటనే పరిస్థితి అదుపులోకి తెచ్చారు. మొత్తమ్మీద తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్టే చెప్పాలి.

 

Tags:    
Advertisement

Similar News

ఇకపై TGPSC, TGRTC