ఇవాల్టితో ప్రచారానికి తెర.. సాయంత్రానికి మైకులు బంద్‌..!

నవంబర్ 30న తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. 13 నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగియనుంది.

Advertisement
Update: 2023-11-27 23:30 GMT

తెలంగాణ ఎన్నికల ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. ప్ర‌చార ప‌ర్వం ముగిసేందుకు ఇంకా కొన్ని గంట‌లే మిగిలున్నాయి. బహిరంగసభలు, రోడ్ షోలు, ఆత్మీయ సమ్మేళనాలు, కార్నర్ మీటింగ్‌లు, పాదయాత్రలతో ఇప్పటివరకూ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తింది. అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ 9వ తేదీన ప్రకటన విడుదల కాగా.. ఈనెల 3న నోటిఫికేషన్ వచ్చింది. ప్రకటన కంటే ముందే రాష్ట్రంలో పోలిటికల్ హీట్ పెరిగింది. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రచారం మరింత జోరందుకుంది. అధికార బీఆర్ఎస్ తరపున కేసీఆర్, మంత్రులు కేటీఆర్‌, హరీష్‌ రావు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇక కాంగ్రెస్, బీజేపీ తరపున ఢిల్లీ నేతలు నియోజకవర్గాలను చుట్టేశారు.

పోలింగ్‌కు 48 గంటల ముందు సైలెన్స్ పీరియడ్ ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. నవంబర్ 30న తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. 13 నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగియనుంది. దీంతో ఆ 13 స్థానాల్లో ఇవాళ సాయంత్రం 4 గంటలకే ప్రచారం ముగియనుంది. సిర్పూర్‌,బెల్లంపల్లి,చెన్నూర్, మంచిర్యాల, ఆసిఫాబాద్‌,మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం స్థానాలు ఈ జాబితాలో ఉన్నాయి. మిగిలిన 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడనుంది.

సైలెన్స్ పీరియడ్ ప్రారంభంతో రాష్ట్రవ్యాప్తంగా ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వస్తుంది. ప్రచారం కోసం వచ్చిన స్థానికేతరులు ఆయా నియోజకవర్గాలను విడిచి వెళ్లాల్సి ఉంటుంది. ప్రలోభాల కట్టడికి నిఘా మరింత పటిష్టం చేయనున్నారు. సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల్లో తనిఖీలు ముమ్మరం చేస్తారు. సాయంత్రం నుంచి మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. ఇక పోలింగ్ ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి.

Tags:    
Advertisement

Similar News