హైదరాబాద్ రికార్డ్ బ్రేక్.. అత్యల్పంగా పోలింగ్

మెదక్ జిల్లా 80.28 శాతం పోలింగ్ తో మొదటి స్థానంలో నిలవగా జనగామ 80.23 శాతం పోలింగ్ తో రెండో స్థానంలో ఉంది.

Advertisement
Update: 2023-11-30 12:29 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతం భారీగా పడిపోయింది. 2018 ఎన్నికల్లో 73.20 శాతం పోలింగ్ నమోదవగా.. ఈ సారి ఓటింగ్ శాతం 63.94 దగ్గరే ఆగిపోయింది. ఈ దఫా అత్యధికంగా మెదక్‌ జిల్లాల్లో 80.28 శాతం పోలింగ్ నమోదు కాగా.. యధావిధిగా హైదరాబాద్‌ లోనే అత్యల్ప పోలింగ్ శాతం నమోదయింది. హైదరాబాద్ లో కేవలం 39.97శాతం పోలింగ్‌ జరగడం విశేషం.

2018లో గ్రేటర్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ 42శాతానికి పైబడింది. కానీ ఈసారి అది 40కంటే కిందే ఆగిపోయింది. అర్బన్ ఓటర్ పూర్తిగా పోలింగ్ కి మొహం చాటేసినట్టు అర్థమవుతోంది. సెలవు ప్రకటించినా, ర్యాపిడో వంటి సంస్థలు ఉచిత రవాణా సౌకర్యం కల్పించినా, పోలింగ్ బూత్ లు గూగుల్ లో వెదికేంత సులువుగా మారినా కూడా అర్బన్ ఓటర్ ఇంటికే పరిమితమయ్యాడు. దీంతో హైదరాబాద్ లో పోలింగ్ శాతం 39.97 దగ్గర ఆగిపోయింది.

మెదక్ జిల్లా 80.28 శాతం పోలింగ్ తో మొదటి స్థానంలో నిలవగా జనగామ 80.23 శాతం పోలింగ్ తో రెండో స్థానంలో ఉంది. యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట, నల్గొండ, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో 75శాతంకి పైగా పోలింగ్ నమోదయింది. ఇది సాయంత్రం 5 గంటల వరకు ఉన్న అంచనా. కొంతమంది అప్పటికీ క్యూలైన్లలో ఉండటంతో వారికి కూడా ఓటింగ్ అవకాశం కల్పించారు. వారితో కలిపి లెక్క వేసినా గణాంకాల్లో స్వల్ప తేడా మాత్రమే ఉంటుంది. 


Tags:    
Advertisement

Similar News